
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్‌ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే..
ఇంటర్నెట్‌లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్‌లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి.
ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్‌మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.
i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now
— Sam Altman (@sama) September 3, 2025
ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్‌మన్‌ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్‌ఇంటర్నెట్‌కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్‌లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్‌గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్‌తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్‌మన్‌ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.
డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?
డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్‌లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే..
Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్‌లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్‌గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్‌లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్‌బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్‌ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే..
సోషల్‌ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్‌వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్‌లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.
అందుకే అంత రీచ్..
సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్‌లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్‌లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం.
సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్‌కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్‌గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్‌లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్‌లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది.
నష్టాలేంటంటే..
నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్‌మన్ పోస్ట్‌తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్‌లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.
నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు.
సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.
కొసమెరుపు..
ఏఐ బాట్‌లు, డీప్‌ఫేక్‌లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్‌లైన్‌లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్‌మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్‌బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్‌చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్‌నెట్‌వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.
:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం