టారిఫ్‌ వార్‌.. ఎవరికి లాభం?  | India, US looking to cut tariffs, boost trade via Bilateral Trade Agreement | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ వార్‌.. ఎవరికి లాభం? 

Published Sat, Mar 8 2025 6:00 AM | Last Updated on Sat, Mar 8 2025 6:00 AM

India, US looking to cut tariffs, boost trade via Bilateral Trade Agreement

అమెరికాపై సగటున 18 శాతం సుంకాలు 

మనపై అమెరికా విధిస్తున్నది సగటున 5 శాతం లోపే 

పరస్పర సుంకాలు అమలైతే మనపై తీవ్ర ప్రభావమే!

కేంద్రం దిద్దుబాటు చర్యలు

పలు సుంకాల తగ్గింపు యోచన

అన్నట్టుగానే భారత్‌పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెర తీశారు. ఏప్రిల్‌ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్‌ల రగడకు తెర దించేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది.

 కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్‌ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. 

ఏ మేరకు సుంకాలు? 
సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్‌ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్‌పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్‌ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్‌ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది.

 ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్‌ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్‌ వంటి అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్‌ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్‌ అంటే భారీ ఆసక్తి. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీలకూ భారత్‌ ప్రధానమే’’ అని వారంటున్నారు. 

అమెరికాతో భారత్‌ వాణిజ్యమెంత? 
అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్‌ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్‌ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్‌ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. 

మనకు మేలే! 
ట్రంప్‌ తెర తీసిన టారిఫ్‌ వార్‌ అంతిమంగా భారత్‌కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్‌కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరి
కాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్‌ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్‌ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. 

ఇప్పటికే చర్యలు 
అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్‌ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... 
→ ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్‌ ఫోన్‌ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.

→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్‌ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్‌–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. 
→ ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.

→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్‌ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. 
→ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. 

త్వరలో ఒప్పందం: భారత్‌ న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్‌ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌«దీర్‌ జైస్వాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.

సుంకాల తగ్గింపుకు భారత్‌ ఒప్పుకుంది: ట్రంప్‌ 
అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్‌ అంగీకరించినట్టు ట్రంప్‌ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్‌ ఓవల్‌ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్‌ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement