
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్‌లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే..
విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?..
షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్‌లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్‌ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు.
సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్‌తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.
ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్‌ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.
ట్రయల్స్.. సక్సెస్..
‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్‌లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది.
వైద్య చరిత్రలో మైలురాయే!
ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్‌స్టాప్‌గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్‌లు (Acrylates)సైనోఎక్రిలేట్‌లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్‌లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.
1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం.
సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్‌లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.