
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్‌లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్‌కార్డ్ Discord అనే చాట్ ప్లాట్‌ఫారమ్‌ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.
పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్‌కార్డ్ యాప్‌నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు.
Discord అనే యాప్ గురించి మిలెనియల్స్‌కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్‌కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్‌లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్‌గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది.
వీపీఎన్ సాయంతో..
సాధారణంగా వీపీఎన్‌లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్‌లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్‌గా పేరున్న డిస్‌కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఉన్నట్లు ఎండ్‌లెస్ ఫీడ్‌లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్‌ఛాయిస్‌గా అక్కడి యువత భావించింది.
అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్‌లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్‌లో చర్చలు, అనౌన్స్‌మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్‌లైన్‌లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్‌ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.
ఓటింగ్ కూడా..
నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్‌కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్‌గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్‌కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్‌ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు.
ఇక డిస్‌కార్డ్‌లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్‌ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్‌లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్‌ఐఎన్‌టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్‌లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది.
భారత్‌లోనూ డిస్‌కార్డ్
Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్‌లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్‌లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్‌లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ విండోస్, మాక్‌ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు.
డిస్‌కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్‌తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్‌కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్‌ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!.