
గిన్నిస్ ప్రపంచ రికార్డ్ దిశగా భారీ వంటకం
4,000 కేజీల బియ్యం, 1,200 కిలోల టమాట పేస్ట్, 600 కేజీల ఉల్లిగడ్డల వినియోగం
గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించాలంటే అద్వితీయ, అసాధారణ ఫీట్ చేయాల్సిందే. అతిభారీ వంటకంతో గిన్నిస్ పుస్తకంలోకి నేరుగా ఎక్కేయాలని నైజీరియా పాకశాస్త్ర ప్రవీణురాలు హిల్దా బకీ సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా జోలోఫ్ రైస్‌వంటకానికి కావాల్సి దినుసులన్నీ సమకూర్చుకుని అతి భారీ వంటకాన్ని తయారుచేశారు.
ఇప్పటికే నమోదైన రికార్డ్‌తో పోలిస్తే ఇది పెద్దది కావడంతో అనధికారికంగా ఈ రికార్డ్‌ను బద్దలుకొట్టినట్టేలెక్క. ఇక ఈ రికార్డ్‌ను గిన్నిస్ పుస్తకం ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించడమే తరువాయి. ఈ రికార్డ్ ఫీట్‌కు నైజీరియాలోని విక్టోరియా ద్వీపంలోని ఎకో హోటల్స్ అండ్ సూట్స్ వేదికైంది. ఈ భారీ వంటకాన్ని కళ్లారా చూసేందుకు, నోరారా రుచి చూసేందుకు వందలాది మంది భోజనప్రియులు బారులుతీరారు. శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
సమన్వయంతో.. సమపాళ్లలో..
హిల్దా బకీ గతంలోనే ఏకధాటిగా 93 గంటలకుపైగా వంటచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. కానీ అవన్నీ వేర్వేరు చిన్నపాటి వంటకాలు. కానీ ఇది వేలకేజీల ఒకే వంటకం. అదికూడా నైజీరియా దేశ సంప్రదాయ ‘జోలోఫ్ రైస్’వంటకం. మేకమాంసం, బియ్యం, టమాటా పేస్ట్‌తో చేసే స్థానిక వంటకం. ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, సెలబ్రిటీగా హిల్దా ఇప్పటికే మహా క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఈమె చేసే వంటకంపై స్థానికంగా అంచనాలు భారీగా పెరిగాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆమె ఏకంగా 300 మంది సహాయకులు పేద్ద బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు. కనీసం ఏడాది క్రితమే ఈ భారీ వంటకం కోసం ప్రణాళికలు సిద్ధంచేశారు. కనీసం రెండు నెలలుగా ఈమె బృందం అహరి్నశలు కష్టపడి అన్ని రకాల మేలుజాతి సరకులను తెప్పించి వంటకోసం సిద్ధంచేసుకుంది. 4,000 కేజీల బియ్యం, 1,200 కేజీల టమాట పేస్ట్, 600 కేజీల ఉల్లిగడ్డలు, 6,000 లీటర్ల మంచినీరు, 168 కేజీల మేకమాంసం, 700 కేజీల వంటనూనెలతో వంటకాన్ని సిద్ధంచేశారు.
ఇంతపెద్ద వంట వండేందకు అదే స్థాయి అతిపెద్ద స్టీల్ పాత్ర అవసరం. అందుకే 23,000 లీటర్ల సామర్థ్యముండే స్టీల్ పాత్రనూ ప్రత్యేకంగా తయారుచేయించారు. ‘‘వంటకోసం అన్ని సిద్ధమైనా అంతటి దినుసులు, బియ్యాన్ని తిప్పే గరిటెలు లేవు. అందుకే భారీ దుంగలను గరిటెల్లాగా తయారుచేశాం’’అని పాకశాస్త్ర ప్రవీణురాలు హిల్దా బకీ చెప్పారు. ‘‘నాలుగేళ్ల క్రితం ఒక వంటల పోటీలో ఇదే జోలోఫ్ రైస్ వంటకం అద్భుతంగా వండి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నా. ఆ తర్వాత 2023 ఏడాదిలో ఏకబిగిన 93 గంటల 11 నిమిషాలు ఆగకుండా పలురకాల వంటటుచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టా’’అని ఆమె చెప్పారు.
‘‘ఎకో హోటల్స్ అండ్ సూట్స్‌లో వంటకం వండట్లేరు. రికార్డ్‌ను వండుతున్నారు. చూసొద్దాం. కుదిరితే మన ఫేవరెట్ జోలోఫ్ రైస్ తినొద్దాం’’అంటూ పలువురు నెటిజన్లు ఈమెకు ఆన్‌లైన్‌లో తెగ మద్దతు ప్రకటించారు. అన్ని దినుసులు సిద్ధంచేసుకుని వంట మొదలెట్టాక కేవలం 9 గంటల్లోనే వంట పూర్తిచేయడం విశేషమని పలువురు పొగిడారు. ‘‘ఈమె క్రమశిక్షణ, సృజనాత్మకత నుంచి యువత ఎంతో నేర్చుకోవాలి. దేశ సంప్రదాయ వంటకానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తున్న ఈమెకు నా ఆశీస్సులు’’అని నైజీరియా సమాచార శాఖ మంత్రి మొహమ్మెద్ ఇద్రీస్ అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్