
సంచలనాలకు నెలవైన ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐస్ క్రీం అనేది ఇక ఆ దేశంలో వినిపించకూడదని నిర్ణయించారు. ఈ తరహా నిర్ణయాలు కిమ్ గతంలోనూ తీసుకున్నాడని చదివే ఉంటారు. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా తెలిసే ఉండొచ్చు. మరి ఐస్ క్రీంపై కిమ్‌కు ఎందుకు కోపమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదమే. కానీ, ఇప్పుడది కొరియా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఆ పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్.

డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య (Western) పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.

సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే.. టూర్ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ విధంగా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుండి దూరంగా కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్‌బర్గ్ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి.
ఉల్లంఘిస్తే..
ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ-సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు.
కొసమెరుపు..
ఎస్కిమోలు.. ఈ పదం ఎక్కడైనా విన్నట్లు ఉందా?.. అలస్కా, కెనడా, గ్రీన్‌లాండ్, సైబీరియా.. అర్కిటిక్ రీజియన్‌లోని మంచు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు. అయితే.. ఇప్పుడా పదం అవుట్‌డేటెడ్ అయ్యింది. కొన్ని తెగలు ఆ పదాన్ని అభ్యంతరకరంగా కూడా భావిస్తున్నాయి. అందుకే ఈ పదం పెద్దగా వినియోగంలో కనిపించడం లేదు. అలాంటిది ఈ పదం ఇప్పుడు నార్త్ కొరియాలో ప్రముఖంగా వినిపిస్తుండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇంగ్లీష్ నుంచి నేరుగా పదాన్ని తీసుకోవద్దనే ప్రయత్నంగా కనిపిస్తోంది.

కిమ్.. కొన్ని సంచలన నిర్ణయాలు
విదేశీ వినోదం.. మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించారు.
మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్‌వర్క్‌లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడం నిషేధం
హాట్‌డాగ్‌లపై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్‌డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం నిషేధించారు. ఇది "దేశద్రోహం"గా పరిగణించబడుతోంది.
బుదాయ్-జిగే (Korean-American fusion dish) నిషేధం: దక్షిణ కొరియా నుండి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్‌లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.
వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించబడుతోంది.
ఆధ్యాత్మిక స్వేచ్ఛపై.. మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను పూర్తిగా నిషేధించారు.
జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు కిమ్ గత పాలకులు కిమ్ ఇల్-సంగ్ , కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదు
హెయిర్‌స్టైల్, లెదర్‌జాకెట్లపై నిషేధం: కిమ్ ప్రభుత్వానికి నచ్చని హెయిర్‌స్టైల్‌లు వేసుకోవడం నేరంగా మారింది. ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైల్‌లే అనుమతించబడ్డాయి. అలాగే కిమ్ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్ స్టయిల్‌ను ఫాలో అయినా సరే అది నేరమే.
అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. పైనే చెప్పుకున్న నేరాలన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటికి పాల్పడినవారిని శ్రమ శిబిరాలకు పంపించడం సాధారణంగా మారింది. అక్కడ వారు జీతం లేకుండా, భద్రత లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.
ఒకవేళ అదే నేరాన్ని కిమ్ తీవ్రంగా భావిస్తే మాత్రం.. అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకోవాల్సిందే!.