క్వెట్టా అంటే వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లు.. క్వెక్టో అంటే ఒకటిలో వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లవ వంతు

How Much Does Earth Weigh And How Is This Measured - Sakshi

భూమి బరువు ఆరు రొన్నా గ్రాములు... గురుగ్రహం బరువు రెండు క్వెట్టా గ్రాములు ..ఇదేంటి అంతంత పెద్ద గ్రహాల బరువులు గ్రాముల్లోనా? అనిపిస్తోందా.. అవి ఉత్త గ్రాములు కాదు.. ‘చాలా చాలా పెద్ద గ్రాములు’.. మరీ లక్షలకు లక్షలు, కోట్లకు కోట్ల సంఖ్యల్లో ఏం చెప్తాంలే అన్న ఉద్దేశంతో.. శాస్త్రవేత్తలు ఇలా కొత్త ప్రామాణిక సంఖ్యల పేర్లను సిద్ధం చేశారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..     
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

అతిపెద్ద సంఖ్యల అవసరంతో.. 
ఇంటర్నెట్‌ డేటా గానీ.. వాతావరణం, అంతరిక్ష విశేషాలుగానీ.. కంప్యూటర్లు చేసే లెక్కల లెక్కగానీ అతి పెద్దవి. ఏవైనా కోట్ల కోట్లలో చెప్పుకోవాల్సినవి. ఇలా చెప్పుకోవడం కష్టం. అతిపెద్ద డేటా పెరిగిపోతుండటంతో సులువుగా పిలవడం, లెక్కగట్టడం కోసం శా­స్త్రవేత్తలు అతిపెద్ద సంఖ్యలకు పేర్లు పెడు­తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఫ్రా­న్స్‌లో జరిగిన ‘ప్రపంచ వెయిట్స్‌ అండ్‌ మెజర్స్‌’ జనరల్‌ కాన్ఫరెన్స్‌లో రెండు అతి­పెద్ద, మరో రెండు అతిచిన్న సంఖ్యలకు పేర్లను ఆమోదించారు. 

‘బేస్‌’ కొలతలకు అదనంగా.. 
దాదాపు ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్న మెట్రిక్‌ విధానంలో కొన్ని ప్రధాన కొలతలు ఉన్నాయి. బరువుకు గ్రాములు, దూరానికి మీటర్లు, సమయానికి సెకన్లు, ఉష్ణోగ్రతకు కెల్విన్, వెలుగు తీవ్రతకు క్యాండెలా వంటివి ‘బేసిక్‌’ కొలతలు. వీటికి అదనపు సంఖ్యా పదాలను జోడించి వినియోగిస్తుంటారు. ఉదాహరణకు వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్‌ అన్నమాట. 

అతిపెద్దవి.. అతి చిన్నవి.. 
ప్రస్తుతం కొత్తగా అమల్లోకి తెచ్చిన అతిపెద్ద సంఖ్యల పేర్లు రొన్నా, క్వెట్టా.. అతి చిన్న సంఖ్యల పేర్లు రొంటో, క్వెక్టో.. 
►రొన్నా అంటే ఒకటి పక్కన 27 సున్నాలు. అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు. 
►క్వెట్టా అంటే ఒకటి పక్కన 30 సున్నాలు. అంటే వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లు. 
►రొంటో అంటే పాయింట్‌ పక్కన 26 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య. అంటే ఒకటిలో పది లక్షల కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట. 
►క్వెక్టో అంటే పాయింట్‌ పక్కన 29 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య. అంటే ఒకటిలో వంద కోట్ల కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట) 
►ఇప్పటివరకు ప్రత్యేకమైన పేరు పెట్టి వినియోగిస్తున్న అతిపెద్ద సంఖ్య యొట్టా (ఒకటి పక్కన 24 సున్నాలు – అంటే వెయ్యి కోట్ల కోట్ల కోట్లు).. అతి చిన్న సంఖ్య యొక్టో (పాయింట్‌ పక్కన 23 సున్నాలు ఆ తర్వాత ఒకటి ఉండే సంఖ్య – అంటే ఒకటిలో.. వెయ్యి కోట్ల కోట్ల కోట్లవ వంతు అన్నమాట). ఈ సంఖ్యల పేర్లను చివరిసారిగా 1991లో ఖరారు చేశారు. తాజాగా దీనికన్నా పెద్దవాటిని ఓకే చేశారు. 

ఈ సంఖ్యలతో వేటిని కొలుస్తారు? 
ఉదాహరణకు అణువులు, పరమా­ణు­వులు, వాటిలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వంటి వాటి బరువు గ్రాములో కోట్ల కోట్ల వంతు ఉంటుంది. మరోరకంగా చెప్పాలంటే కొన్ని లక్షలకోట్ల కోట్ల ఎలక్ట్రాన్లు, ప్రో­టా­న్లు కలిపినా ఒక గ్రాము బరువు ఉండవు. మరి వాటిలో ఒకదాని బరువును చెప్పేందుకు వీలయ్యేవే అతి చిన్న సంఖ్యలు. ఇక గ్రహాలు, నక్షత్రాల బరువులు, ఖగోళ దూరాలు వంటి అత్యంత భారీ కొలతల కోసం పెద్ద సంఖ్యలను వాడుతారు. ఉదాహరణకు.. 
►ఒక హైడ్రోజన్‌ పరమాణువు బరువు సుమారు రెండు యొక్టో గ్రాములు 
►ఒక ఎలక్ట్రాన్‌ బరువు రొంటోగ్రాము కంటే కూడా కాస్త తక్కువ. 
►అదే సూర్యుడి బరువు సుమారు 20 లక్షల రొన్నా గ్రాములు. లేదా రెండు వేల క్వెట్టా గ్రాములు అన్నమాట. (3.3 లక్షల భూగ్రహాలు కలిస్తే ఒక సూర్యుడు అవుతాడు మరి)  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top