వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ నుంచి మరో కీలక అధికారిని తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్ ట్రంప్ కేబినెట్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉందని ‘పోలిటికో’ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ అడ్మినిట్రేషన్‌లో అంతర్గత ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పటేల్ భవిష్యత్తుపై వైట్‌హౌస్ వర్గాల్లో ప్రశ్నలు తలెత‍్తుతున్నాయి.
ఇప్పటికే ట్రంప్ పలువరు కీలక అధికారులను తొలగించారు. ఈ వారమే ట్రంప్ అనుమతితో అమెరికా నౌకాదళ కార్యదర్శిని తొలగించారు. ఆ తర్వాత తదుపరి వెళ్లే సీనియర్ అధికారి ఎవరన్న ఊహాగానాలు మరింత పెరిగాయి.
పోలిటికో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్‌హౌస్ అధికారి సూచించారు. కాష్ పటేల్‌ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, ఇప్పుడు ప్రశ్న “ఎప్పుడు తొలగిస్తారు?” అన్నదేనని వ్యాఖ‍్యానించారు. మీడియాలో ఆయనపై నెగటివ్ వార్తలు ఎక్కువగా రావడం, ఆయన పనితీరు, నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరగడం అందుకు కారణాలుగా చెప్పారు. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదని పేర్కొన్నారు. ఇది ట్రంప్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోందని చెప్పారు.
కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై రాజకీయపరంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాష్ పటేల్ గురించి వార్తలు వస్తుండడం గమనార్హం.
వరసగా తొలగిస్తున్న ట్రంప్
కొన్ని రోజుల క్రితమే అమెరికా యుద్ధ శాఖ, నౌకాదళ కార్యదర్శి జాన్ సీ ఫెలన్‌ను పదవి నుంచి తొలగించారు. ఉప కార్యదర్శి హంగ్ కావో తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మార్చి నుంచి దాదాపు ఐదుగురు సీనియర్ అధికారులు (ఫెలన్ సహా) ఒత్తిడి మధ్య పదవులు వదిలుకున్నారు. ఫెలన్‌కు ముందు, జనరల్ రాండీ జార్జ్ ఈ నెల ప్రారంభంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి విరమణ చేశారు. ఇరాన్ యుద్ధం మధ్య ఇది అసాధారణ పరిణామం. అలాగే, మరో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులను తొలగించారు.
కాగా, ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో.. ట్రంప్ గవర్నమెంట్ చేస్తున్న ఈ యుద్ధానికి తాను సపోర్టు ఇవ్వలేనని జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ పేర్కొంటూ ఆయన సైతం ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.


