ఊహించని ఘోరం.. ఆ నరమాంస భక్షకిని మమ్మీ తరహాలో భద్రపరుస్తారట!

Egypt Shark That Ate Russian Man Mummified - Sakshi

కైరో: మమ్మీఫైయింగ్‌ ద్వారా ఈజిప్ట్‌ ఫారో చక్రవర్తులను, రాణులను భద్రపర్చడం.. వాటిని పిరమిడ్‌ల కింద మమ్మీలుగా బయటకు తీస్తుండడం తెలిసిందే కదా. ఈజిప్ట్‌లో, ప్రపంచంలోని పలు దేశాల మ్యూజియంలో మమ్మీలను చూడడం షరామామూలే కావొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఒక కిల్లర్‌ షార్క్‌ను మమ్మీఫైయింగ్‌ చేసి ప్రదర్శన కోసం ఉంచనున్నారు.

ఈజిప్ట్‌ నగరం హుర్ఘదా ఎర్ర సముద్ర పరిధిలో ఉన్న ఓ రిసార్ట్‌ తాజాగా జరిగిన ఘోరం గురించి తెలిసే ఉంటుంది. 23 ఏళ్ల రష్యన్‌ యువకుడిని అతని తండ్రి సమక్షంలోనే దాడి చేసి.. చంపి తినేసింది ఓ షార్క్‌(టైగర్‌ షార్క్‌). సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఆ తండ్రితో సహా అక్కడున్నవాళ్లందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ టైంలో తనను రక్షించమంటూ ఆ వ్యక్తి కేకలు వేయడం గమనించొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది కూడా. అయితే.. ఆ తర్వాత ఆ షార్క్‌ను చంపేశారు కూడా.

అది పక్కా కమర్షియల్‌ రిసార్ట్‌. ఎప్పుడూ బోట్లు సంచరిస్తూనే ఉంటాయి. అలాంటి చోట ఈ ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరగడం.. నీళ్లలోకి లాక్కెళ్లి మరీ 20 సెకండ్లలోనే అతన్ని చంపి మింగేయడం లాంటి దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. ఇక మృతుడి శరీర భాగాలను జాలర్లు నీటి నుంచి సేకరించగా.. మరికొన్ని భాగాలు షార్క్‌ పొట్టలో దొరికాయి. ఇదిలా ఉంటే.. ఆ టైగర్‌షార్క​ ప్రవర్తన గురించి పరిశోధకుల్లో ఆసక్తి నెలకొంది. అంత వేగంగా అది దాడి చేసి చంపినందుకు నర​మాంసభక్షకిగా అభివర్ణిస్తున్నారు వాళ్లు. అంతేకాదు దానిని పరిశీలించేందుకు ఇప్పుడొక అవకాశం దొరికిందని.. అందుకే దానిని భద్రపర్చాలని నిర్ణయించుకున్నట్లు మెరైన్‌ సైన్సెస్‌ ఇనిస్టిట్యూట్‌, రెడ్‌సీ రిజర్వ్స్‌ వాళ్లు చెబుతున్నారు. 

సోమవారం నుంచి ఆ షార్క్‌ బాడీకి ఎంబామింగ్‌ చేయడం ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే.. ఆ షార్క్‌ను ఇనిస్టిట్యూట్‌లోని మ్యూజియంలో భద్రపరుస్తారట. దాని ప్రవర్తనకు అధ్యయనం చేసేందుకు దానిని భద్రపరుస్తున్నామని, తర్వాతి తరాలకు ఆ కిల్లర్‌ షార్క్‌ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు దొరికిన భాగాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ తండ్రి.. పుట్టెడు దుఖంతో ఆ అస్తికలను తీసుకుని రష్యాకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇదీ చదవండి: శవపేటిక నుంచి సౌండ్‌ రావడంతో..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top