అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి వైట్‌హౌస్ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్‌గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
గత కొన్నేళ్లలో ఇలా ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరగడం మూడోసారి. అయితే రెండు గంటల పాటు ఆయనను హోటల్ నుండి హడావిడిగా తీసుకువెళ్లిన అనంతరం, అధ్యక్షుడు వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు అనూహ్యమైన ప్రశ్నలు రిపోర్టల నుంచి ఎదురయ్యాయి.
విలేకరులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తుతున్న సమయంలో ఒక అనూహ్యమైన ప్రశ్న . ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ నుంచి దూసుకొచ్చింది. ఈ ప్రశ్నను మీపై చాలా గౌరవ భావంతోనే అడుగుతున్నానంటూనే.. ‘ట్రంప్.. మీపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి. పదే పదే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఇలా ఎందుకు పదేపదే జరుగుతోందని మీరు అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు.
దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. ఈ దాడి కూడా తానొక అద్భుతమైన వ్యక్తిని కాబట్టే జరుగుతుందన్నారు. ‘అవును, మీకు తెలుసు, నేను హత్యల గురించి అధ్యయనం చేశా. ఇక్కడ మీకు నేనొక విషయం చెప్పాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. విశేషంగా కృషి చేసిన వ్యక్తులపైనే ఎప్పుడూ దాడులు జరుగుతాయి. మీరు అబ్రహం లింకన్‌నే చూడండి. అలాంటి వ్యక్తులే టార్గెట్ అవుతూ ఉంటారు’ బదులిచ్చారు.


