
ఖతార్ సూపర్ లగ్జరీ జెట్ గిఫ్ట్...
విమానాన్ని విడదీసి పునర్నిర్మించాలి
పదవీకాలంలో ప్రాజెక్టు పూర్తి అసాధ్యం?
చారాణ కోడికి బారాణ మసాలా.
‘ఎయిర్ ఫోర్స్ వన్’గా మార్చాలంటే మూడింతల ఖర్చు.
ఖతార్ రాజకుటుంబం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత విలాసవంతమైన బోయింగ్ 747-8 విమానాన్ని బహుమతిగా స్వీకరిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ పని సముచితమేనా అని ఎవరైనా అడిగితే.. ‘అంత ఖరీదైన విమానాన్ని ఖతార్ ఉచితంగా ఇస్తానంటుంటే వద్దని చెప్పడానికి నేనేమైనా వెర్రివాడినా?’ అని ట్రంప్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ఖతార్ జెట్ నెల క్రితమే టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకున్నట్టు ఫ్లైట్ రికార్డులను ఉదహరిస్తూ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ విమానాన్ని మెరుగ్గా తీర్చిదిద్దే ఏర్పాట్లు ఆరంభమై ఉండొచ్చని కూడా పేర్కొంది. ఈ నెల 8న విమానం శాన్ ఆంటోనియో చేరుకుందని, అప్పట్నుంచి అది అక్కడే ఉందని ‘శాన్ ఆంటోనియో ఎక్స్‌ప్రెస్ న్యూస్’ తెలిపింది. విమానం రెట్రో ఫిట్టింగ్ పనులను డిఫెన్స్ కాంట్రాక్టర్ ‘ఎల్3 హ్యారిస్ టెక్నాలజీస్’కు ట్రంప్ పురమాయించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ మరో కథనం ప్రచురించింది. ఖతార్ ఫ్రీగా ఇస్తున్న 13 ఏళ్లనాటి ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు (రూ.3,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసినప్పటికీ దాని విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.2,100 కోట్లు) మాత్రమేనని ఆ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు.
ఇక చావు కబురు చల్లగా చెప్పినట్టు.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి అనువుగా, ఎయిర్ ఫోర్స్ వన్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్పు చేర్పులు (ఓవర్ హాలింగ్) చేపట్టడానికి ఆ విమానం విలువకు మూడు రెట్లు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని లెక్కలు వేస్తున్నారు. 40 ఏళ్ల నాటి తమ పాత ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలను తాత్కాలికంగా పక్కనపెట్టి ఖతార్ సూపర్ లగ్జరీ విమానంలో దర్పంతో తిరగాలని ట్రంప్ ఉబలాటపడుతున్నారు. దీనిపై ఆయన సొంత రిపబ్లిక్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ‘కమాండర్ ఇన్ చీఫ్’ హోదాలో అధ్యక్షుడి సురక్షిత ప్రయాణానికి వీలుగా ఖతార్ విమానానికి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ తరహాలో మార్పులు చేయడానికి బాగానే సమయం పడుతుందట.
కమ్యూనికేషన్, రక్షణ సామర్థ్యాలతోపాటు విమానంలో భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి కొన్ని నెలల నుంచి రెండేళ్ల దాకా వ్యవధి పట్టవచ్చని భావిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని, అధ్యక్షుడిగా ట్రంప్ రెండో టర్మ్ ముగిసేలోపు ఆ ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని అమెరికా అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా ఖతార్ విమానంతో గూఢచర్యం, నిఘా సమస్యలున్నాయని రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ వ్యాఖ్యానించారు. ఖతార్ కానుకను అంగీకరించడమంటే తమ భద్రతాపరమైన కీలక వ్యవస్థలు, కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి చొరబడటానికి ఓ విదేశానికి అనుమతి ఇవ్వడమేనని డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ జాక్ రీడ్ అభిప్రాయపడ్డారు.
మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ పాయింట్!
అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానం.. కదిలే వ్యవస్థ లాంటిది. అధ్యక్షుడి భద్రతలో అమెరికా రక్షణ విభాగం రాజీపడదు. భద్రతాపరమైన లోపాలకు తావివ్వదు. అందుకే ఖతార్ విమానాన్ని ‘ఈకకు ఈక, తోకకు తోక పీకినట్టు’ ఫ్రేమ్ వరకు భాగాలుగా విడగొట్టి అమెరికా తొలుత దాన్ని ఆసాంతం శోధించాలి. బగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన కమ్యూనికేషన్స్, సెక్యూరిటీ ఎక్విప్మెంట్ అమర్చి విమానాన్ని పునర్నిర్మించాలి. ఇంత పెద్ద తతంగం ఉంది మరి!.
విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అన్యులెవరూ హైజాక్ చేయకుండా చూడాలి. ఎందుకంటే దేశాధ్యక్షుడు విమానంలో ప్రయాణించే సమయంలో మిలిటరీ ‘కమాండ్ అండ్ కంట్రోల్’కు ఆ ఎలక్ట్రానిక్ వ్యవస్థలే ఆయువుపట్టు. ఖతార్ విమానాన్ని ఇలా అప్గ్రేడ్ చేయడానికి, మెరుగ్గా తీర్చిదిద్ది ముస్తాబు చేయడానికి చాలా కాలం పట్టవచ్చు. ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపుకునే వెసులుబాటు ఉంది. అయితే దేశాధ్యక్షుడు ప్రయాణంలో ఉండగా ‘ఎయిర్ ఫోర్స్ వన్’కు గాల్లోనే ఇంధనం నింపిన సందర్భం ఇప్పటివరకు ఒక్కటీ లేదు. ఖతారీ సంప్రదాయ బోయింగ్ 747 విమానానికి గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యం లేదు. ఉదాహరణకు అణుదాడి జరిగిన సందర్భంలో నేలపై దిగకుండా అమెరికా అధ్యక్షుడి విమానం సురక్షితంగా ఎక్కువసేపు గాల్లోనే ఉండాల్సివస్తే... ఆ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయెలింగ్ సామర్థ్యం తప్పనిసరి!
-జమ్ముల శ్రీకాంత్.