ఖతార్‌ భద్రత మా బాధ్యత.. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం | Donald Trump signed Executive order Over Qatar | Sakshi
Sakshi News home page

ఖతార్‌ భద్రత మా బాధ్యత.. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం

Oct 2 2025 9:52 AM | Updated on Oct 2 2025 9:52 AM

Donald Trump signed Executive order Over Qatar

దుబాయ్‌: ఖతార్‌ భద్రత తమ బాధ్యతని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఖతార్‌ రక్షణకు అవసరమైతే సైనిక పరంగా సాయమందిస్తామని స్పష్టం చేస్తూ తాజాగా ఆయన ఓ ఉత్తర్వు జారీ చేశారు. సోమవారం దీనిపై సంతకం చేయగా బుధవారం వైట్‌ హౌస్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే, దీనిపై అమెరికా ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది స్పష్టం కావాల్సి ఉంది.

గాజాలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు ఖతార్‌ ఉన్న హమాస్‌ నేతలపై ఇటీవల ఇజ్రాయెల్‌ అనూహ్యంగా దాడికి దిగడం తెల్సిందే. సోమవారం వైట్‌ హౌస్‌లో ట్రంప్‌తో చర్చలు జరిపిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఆయన సమక్షంలోనే ఖతార్‌ నాయకత్వానికి క్షమాపణ చెప్పడం తెలిసిందే.

తాజాగా, ఖతార్‌కు మద్దతుగా ట్రంప్‌.. సన్నిహిత సహకారం, ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా ఖతార్‌ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు, బయటి నుంచి జరిగే దాడుల నుంచి రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆ ఉత్తర్వులో ప్రకటించారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖతార్‌ రాజధాని దోహాలోని హమాస్‌ కార్యాలయంలో ఉన్న ఆరుగురు చనిపోయారు. ఈ దాడి అనంతరం సౌదీ అరేబియా అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement