
కురుక్షేత్ర యుద్ధంలో.. అశ్వత్థామ అనే ఏనుగు మరణిస్తుంది. అయితే.. ద్రోణాచార్యుడిని మట్టుబెట్టడానికి ఇదే మంచి తరుణమని శ్రీకృష్ణుడు భావిస్తాడు. ఆయన సూచన మేరకు అశ్వత్థామః హతః అని గట్టిగా.. కుంజరః(ఏనుగు)అని ధర్మరాజు నెమ్మదిగా విలపిస్తాడు. తన కుమారుడే చనిపోయాడని భావించి యుద్ధాన్ని వదిలిపెట్టి ధ్యానంలోకి వెళ్తాడు ద్రోణుడు. అదను కోసం ఎదురు చూస్తున్న ధృష్టద్యుమ్నుడు (ద్రుపదరాజు కొడుకు) ద్రోణుడ్ని హతమారుస్తాడు. అమెరికా మిత్రదేశం ఖతార్ విషయంలోనూ ట్రంప్ ఇదే తరహా స్ట్రాటజీ ఫాలో అయ్యారా? అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు..
2025 సెప్టెంబర్ 9న.. ఇజ్రాయెల్ సైన్యం ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు జరిపింది. హమాస్ నేతలే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాల డబుల్ గేమ్ బయటపడింది.
గాజా కాల్పుల విమరణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా.. ట్రంప్ హమాస్‌కు చివరి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హమాస్ అగ్రనేతలు హుటాహుటిన దోహాలో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే దాడి జరిగింది. ఫలితంగా.. హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్‌కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు..
దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చాం: టెల్అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని) వర్గాలు
అవును.. ఇజ్రాయెల్ సమాచారం అందించిన వెంటనే.. దాడి గురించి ఖతార్(Qatar)కు సమాచారం ఇచ్చాం: అమెరికా
దాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత యూఎస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పేలుళ్లు కొనసాగుతుండగానే అమెరికా అధికారి ఒకరు ఆ సమాచారం అందించారు: ఖతార్ విదేశాంగ శాఖ అధికారి
అమెరికా- ఖతార్‌ల మధ్య బంధం ఇటీవల బలపడింది. అధ్యక్ష హోదాలో తొలిసారి గల్ఫ్ దేశంలో పర్యటించిన ట్రంప్.. 400 మిలియన్ డాలర్ల విలువ చేసే విలాసవంతమైన విమానాన్ని ఖతార్ నుంచి బహుమతిగా అందుకున్నారు. ప్రతిగా.. ఆ దేశ పర్యటనలో 243 బిలియన్ డాలర్ల కీలక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పైగా ట్రంప్ కొడుకు ఎరిక్ కూడా అక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటునకు ఒప్పందం చేసుకున్నాడు. పైగా ఇరాన్‌కు ఖతార్ మిత్రదేశం కావడంతో.. టెహ్రాన్ బ్యాక్ చానెల్ కమ్యూనికేషన్‌లాగా ట్రంప్ పరిగణిస్తున్నారు. వీటన్నింటికి తోడు.. పశ్చిమాసియాలో తన దౌత్య ప్రయత్నాలకు ఈ గల్ఫ్ దేశం కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటప్పుడు.. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం, శాంతిదూత ట్రంప్ దానిని చూస్తూ ఉండిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో.. ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి గందరగోళమైన ప్రకటనలు వెలువడ్డాయి. దాడి గురించి తాము సమాచారం ఇచ్చామని.. తమకు సమాచారం అందిందని చెప్పిన ఇజ్రాయెల్, అమెరికాకు కొద్దిగంటలకే మాట మార్చాయి.
వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ దాడి గురించి తెలియజేయాలని పశ్చిమాసియా రాయబారి విట్కాఫ్‌ను ట్రంప్ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. దాడి గురించి ముందే చెప్పామంటూ హడావుడిగా వివరణ ఇచ్చారు. అనంతరం దాడికి సంబంధించిన నిర్ణయం తాను తీసుకోలేదని.. మరోసారి ఇలాంటి దాడులు జరగవని హామీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక.. ఈ దాడి పూర్తిగా తమ చర్యేనని, ఇందులో యూఎస్ ప్రమేయం లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటమార్చారు.
మెహ్దీ హసన్ అనే జర్నలిస్టు.. ‘ట్రంప్ ఖతార్ నుంచి విమానం తీసుకున్న తర్వాత అదే దేశంపై బాంబింగ్‌కు అంగీకారం ఇచ్చాడా?’’ అంటూ విమర్శించారు. డాక్టర్ అండ్రెస్ క్రెయిగ్ అనే విశ్లేషకుడు: ‘‘ఖతార్‌కు ముందుగా సమాచారం ఇచ్చినట్లైతే, ప్రాణనష్టం జరగకుండా చూసుకునేవారు’’ అని ట్వీట్ చేశారు.
ఏది ఏమైనా.. ఈ దాడి నేపథ్యంలో అరబ్ దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఖతార్‌పై జరిగిన దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాయి. ఇది అమెరికాకు ఒకరకంగా మింగుడు పడని విషయమే. మరోవైపు.. ఖతార్‌లో గాజా చర్చల కోసం హమాస్ నేతలు భేటీ అయినప్పుడే ఈ దాడి జరిగింది. దీంతో.. శాంతి చర్చలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.