
‘ఎగిరే ప్యాలెస్’ కోసం ట్రంప్ కక్కుర్తి
రూ.3,400 కోట్ల సూపర్ లగ్జరీ విమానం
జనానికి ‘ఫ్రీ’ అనే పదం వినపడినంత సొంపుగా మరొకటి చెవులకు సోకదు. ఫ్రీ అంటే ఫినైల్ తాగేవాడుంటాడని ప్రతీతి. ‘ఉచితం’ దేశాధ్యక్షులకూ బహు ప్రీతి. ఈ ఉచితం... ‘ఉచితమా’? సముచితమా? కాదా? అని ఆలోచించరు. అమెరికా అధ్యక్షుడూ ఇందుకు మినహాయింపు కాదు. ‘ఉచిత’ ఎయిర్ ఫోర్స్ వన్. ఖతారోడు ఫ్రీగా జంబోజెట్ ఇస్తాట్ట. అది సూపర్ లగ్జరీ ‘బోయింగ్ 747-8’ విమానం. ‘ప్యాలెస్ ఇన్ ద స్కై’ అంటున్నారు. ‘ఆకాశంలో ఎగిరే హర్మ్యం’గా అభివర్ణిస్తున్నారు. ప్రైవేటు బెడ్రూం సూట్, బోర్డు రూమ్స్, పాలరాయితో అలంకరించిన స్నానాలగదులు, గ్రాండ్ స్టెయిర్కేస్ వంటి ఫీచర్స్ అందులో ఆ విమానాన్ని ఖతార్ ఇస్తే ట్రంప్ తీసుకోవడమేనా? ఎవడో విసిరే బిస్కట్ కోసం అగ్రరాజ్యం అంతగా కక్కుర్తిపడుతోందా?
అమెరికా అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు కేవలం ‘విమానాల సేకరణ’ స్థాయికి దిగజారిందా? ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని అమెరికా అధ్యక్షుడు పుచ్చుకోవడం అనైతికం, చట్ట విరుద్ధం అంటున్నారు విమర్శకులు. పైగా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,400 కోట్లు. అయితే ఖతార్ గిఫ్టుగా ఇచ్చే విమానంలో తాను తిరగబోనని చెబుతున్నారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వాడిన బోయింగ్ 707 విమానాన్ని సేవల నుంచి తప్పించి మ్యూజియంలో ఓ వస్తువుగా ప్రదర్శనకు పెట్టినట్టే... తన పదవీకాలం ముగిశాక భవిష్యత్తులో ‘ప్రెసిడెంట్ లైబ్రరీ’కి ఆ విమానాన్ని దానంగా ఇస్తామని అంటున్నారు ట్రంప్.
అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తవగానే అది ప్రెసిడెంట్ లైబ్రరీకి వెళ్లిపోతుందని ఆయన వివరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విషయానికొస్తే.. అవి రెండు విమానాలు. దాదాపు 40 ఏళ్లుగా వాటిని అమెరికా వినియోగిస్తోంది. భద్రతపరంగా అవి మేలైనవి. కమ్యూనికేషన్ సామర్థ్యాలు, క్షిపణి దాడుల నుంచి కాచుకోవడం, గాల్లోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్ వాటి సొంతం. అయితే ఆ పాత, డొక్కు విమానాలు అధ్యక్షుడికి నచ్చడం లేదు. వాటిని మార్చాలని ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. బోయింగ్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. రష్యాకు చెందిన ఓ విమానయాన సంస్థ కోసం బోయింగ్ గతంలో 747 విమానాలు తయారుచేసింది.
బోయింగ్ నుంచి విమానాలు కొంటామన్న రష్యన్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో ఆ 747 విమానాలకు బోయింగ్ మార్పుచేర్పులు చేస్తూ అదనపు సొబగులు అద్దుతోంది. కీలక సబ్ కాంట్రాక్టర్ దివాలా తీయడం, అర్హత గల సిబ్బంది కొరత కారణాల నేపథ్యంలో సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ ‘747 విమానాల మేకప్ తతంగం’ ఇంకొన్నాళ్లు పట్టేట్టుంది. ట్రంప్ ప్రస్తుత రెండో టర్మ్ ముగిసేలోపు ఆ విమానాలు సిద్ధమయ్యేట్టు లేవు. దీంతో దేశాధ్యక్షుడిలో అసహనం పెరిగిపోతోంది. కొందరు అరబ్ నేతలు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ కంటే మెరుగైన విమానాల్లో ప్రయాణిస్తున్నారంటూ ట్రంప్ ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఖతార్ గడ్డపై అమెరికాకు అతి పెద్ద సైనిక స్థావరం ఉంది.
ప్రస్తుతం ట్రంప్ అటువైపే పర్యటనకు బయల్దేరారు. మే 13-16 తేదీల్లో ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల్లో పర్యటిస్తారు. కొసమెరుపు- ‘కాంగ్రెస్ (చట్టసభలు) అనుమతి లేకుండా ఫెడరల్ అధికారులు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన వస్తువులు, లాభాలు/ప్రయోజనాలు పొందరాదు’ అని అమెరికా రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మరి ‘ఖతార్ గిఫ్ట్’ అంశంలో ట్రంప్ ఏం చేస్తారో! అధ్యక్షుడైనా చట్టానికి అతీతం కాదు. విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వజూపడం వెనుక ఖతార్ ప్రయోజనాలు ఏం దాగున్నాయో!
::జమ్ముల శ్రీకాంత్
(Source: Huffpost, American Broadcasting Company news)