గొంతు విప్పకముందే నొక్కేస్తుంది! | Chinese company GEdge Networks secret AI surveillance project | Sakshi
Sakshi News home page

గొంతు విప్పకముందే నొక్కేస్తుంది!

Jun 17 2026 4:47 AM | Updated on Jun 17 2026 4:48 AM

Chinese company GEdge Networks secret AI surveillance project

విమర్శ చేయకముందే నిషేధం విధించే సరికొత్త నిఘా వ్యవస్థ 

ప్రభుత్వ వ్యతిరేకులను ముందే పసిగట్టేందుకు ప్రయోగాలు

చైనా సంస్థ జీఎడ్జ్‌ నెట్‌వర్క్స్‌ రహస్య ఏఐ నిఘా ప్రాజెక్టు

వివరాలు బహిర్గతం.. పోస్టులు, ఫోన్‌ డేటా,లొకేషన్‌ ఆధారంగా పౌరుల ప్రవర్తన విశ్లేషణ 

ప్రభుత్వంలో జరుగుతున్నఅవినీతి మీద ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టారా? 
వానలతో దెబ్బతిన్న నగర రోడ్ల గురించిఅధికారులను విమర్శిస్తూ ‘ఎక్స్‌’లో కోపంతోఏదైనా కామెంట్‌ చేశారా?
వాట్సాప్‌ గ్రూపులో దేశ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారా?
అయితే జాగ్రత్త..మీ కామెంట్లు, పోస్టుల ఆధారంగా రేపు మీరు ఏమనుకుంటారో, ఎవరిని విమర్శిస్తారో, ఏ నిరసనలో పాల్గొంటారో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ముందే ఊహించి మీ పేరుతో ఒక ’రిస్క్‌ స్కోర్‌’ను రూపొందించే రోజులు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన ఏఐ ఆధారిత నిఘా ప్రాజెక్టు, సాంకేతికత వివరాలు బయటకు పొక్కడంతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తుపై కొత్త ఆందోళనతలెత్తుతోంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ముందే గుర్తించి నియంత్రణ 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు.. భవిష్యత్తులో వారు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విమర్శకులుగా మారే అవకాశముందేమో ముందుగానే గుర్తించి నిషేధించే ఏఐ వ్యవస్థ చైనాలో తయారవుతోంది. చైనాకు చెందిన జీఎడ్జ్‌ నెట్‌వర్క్స్‌ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

సోషల్‌ మీడియా పోస్టులు, ఫోన్‌ డేటా, లొకేషన్‌ ఆధారంగా పౌరుల ప్రవర్తనను విశ్లేషించి వారిపై నిఘా పెట్టే ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతున్నట్లు వెల్లడైంది. భవిష్యత్తులో ప్రభుత్వ విమర్శకులుగా మారే వారిని ముందుగానే గుర్తించి నియంత్రించడానికి ఈ వ్యవస్థను తయారు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా విధించిన చిప్‌ ఆంక్షలతో ఈ ప్రాజెక్టుకు కొంత బ్రేకులు పడినా.. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలు అసమ్మతి వ్యక్తం చేయకముందే వారి గొంతు నొక్కేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్ల రూపకల్పనలో జీఎడ్జ్‌
అమెరికాకు చెందిన వాండర్‌బిల్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ సెక్యూరిటీకి చెందిన పరిశోధకులు.. జీఎడ్జ్‌ సంస్థ తన ప్రభుత్వ మద్దతు ఉన్న పరిశోధనా విభాగం మెసా ల్యాబ్‌తో కలిసి చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్లు రూపొందించే పనిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రొఫైళ్ల ఆధారంగా రాజకీయంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వ్యక్తులను ఏఐ సహాయంతో ముందే గుర్తించే టెక్నాలజీని కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడైంది. 

అయితే అధునాతన చిప్‌ల ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు ఈ ప్రాజెక్టు పురోగతిని కొంతవరకు దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ హయాంలో విధించిన ఆంక్షలు కొంత అడ్డుకున్నాయని అంటున్నారు. అయితే ట్రంప్‌ ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించినప్పటికీ, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్‌లను రూపొందించే ఎన్విడియా తయారీ అత్యాధునిక ప్రాసెసర్లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

దీంతో అమెరికా చిప్‌లపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు స్వదేశీ ఏఐ చిప్‌ల అభివృద్ధిపై చైనా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జీఎడ్జ్‌ వద్ద ఉన్న గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (జీపీయూలు) ప్రస్తుత ఉత్పత్తులకు సరిపోతున్నప్పటికీ, మరింత శక్తివంతమైన అంచనా వ్యవస్థను రూపొందించాలంటే చైనాకు అత్యాధునిక చిప్‌లు అవసరమవుతాయని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.  

లక్షకు పైగా పత్రాల లీక్‌ 
చైనా అమలు చేస్తున్న గ్రేట్‌ ఫైర్‌వాల్‌ తరహా ఇంటర్నెట్‌ పర్యవేక్షణ, సెన్సార్‌షిప్‌ సాఫ్ట్‌వేర్‌ను జీఎడ్జ్‌ నెట్‌వర్క్స్‌ అనేక దేశాలకు వాణిజ్యపరంగా విక్రయిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, సెన్సార్‌షిప్‌ను తప్పించుకునేందుకు పౌరులు చేసే ప్రయత్నాలను గుర్తించడం, ప్రజల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నాయి. 

గత ఏడాది సెప్టెంబర్‌లో జీఎడ్జ్‌ కు సంబంధించిన లక్షకు పైగా పత్రాలు లీక్‌ కావడంతో ఈ నిఘా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలను విశ్లేషించిన వైర్డ్‌ సహా పలు మీడియా సంస్థలు, జీఎడ్జ్‌ తన నెట్‌వర్క్‌ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇథియోపియా, కజకిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్‌ వంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ మొబైల్‌ నెట్‌వర్క్‌లపై భారీ స్థాయి నిఘా నిర్వహించేందుకు సహకరించినట్లు వెల్లడించాయి. తాజాగా జీఎడ్జ్‌ ఇంజనీర్లు ప్రజల మొబైల్‌ సమాచారం, సోషల్‌ మీడియా కార్యకలాపాలు, లొకేషన్‌ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తనా నమూనాలను రూపొందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.  

గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకం? 
కృత్రిమ మేధ సహాయంతో పౌరుల రాజకీయ అభిప్రాయాలను ముందుగానే అంచనా వేసే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ రోజు మీ మొబైల్‌లో చేసిన సెర్చ్, సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్, వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ చేసిన మెసేజ్‌ కేవలం డేటానే కావచ్చు. 

కానీ రేపు అదే డేటా ఆధారంగా మీరు ముందు ముందు ఒక నిరసనకారుడు, ప్రభుత్వ విమర్శకుడు అయ్యే అవకాశముందని ఏఐ ముద్ర వేస్తే? చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త తరం నిఘా సాంకేతికత ప్రస్తుతం భారత్‌ సహా ఇతర దేశాలకు అందుబాటులో లేదనుకున్నా, డిజిటల్‌ పాలన వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అది పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం చైనా కథ కాదని, డిజిటల్‌ యుగంలో ప్రతి పౌరుడి భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక అని అంటున్నారు.

మాస్‌ సర్వైలెన్స్‌ (భారీ స్థాయి నిఘా వ్యవస్థ)కు కృత్రిమ మేధ జత అయితే జరిగేది ఇదే. ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకిగా మారకముందే అతడిని గుర్తించి పర్యవేక్షించే స్థాయికి ఈ టెక్నాలజీ తీసుకెళ్లే ప్రమాదం ఉంది.  – బ్రెట్‌ జే. గోల్డ్‌స్టీన్, వికెడ్‌ ప్రాబ్లమ్స్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ 

ప్రజలు ఏం చేస్తున్నారన్నది మాత్రమే కాదు.. భవిష్యత్తులో వారు ఏం చేయచ్చో ముందే అంచనా వేసే వ్యవస్థలను నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇది నిఘా వ్యవస్థల్లో కొత్త దశ. – అమెరికా భద్రతా వర్గాల విశ్లేషణ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement