
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్షగట్టిన రీతిలో భారతదేశంపై అత్యధికంగా 50 శాతం సుంకం విధించారు. అలాగే ఇతర దేశాలకూ సుంకాలు ప్రకటించారు. అయితే భారత్‌పై అత్యధిక సుంకాలు విధించడంపై చైనా మండిపడుతూ, భారత్‌కు మద్దతు ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రంప్‌కు తలవంచవద్దంటూ భారత్‌కు చైనా సలహా ఇచ్చింది.
భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని దుయ్యబట్టారు. ట్రంప్‌ను ‘బెదిరింపులకు గురి చేస్తున్న దొంగ’గా అభివర్ణించారు. ఆయన తన ‘ఎక్స్’ పోస్టులో ‘ఒక దొంగకు ఒక అంగుళం అవకాశం ఇస్తే.. అతను ఒక మైలు దూరం వరకూ వెళ్తాడు’ అని కామెంట్ చేశారు. చైనా రాయబారి తన పోస్టులో..‘ఇతర దేశాలను అణచివేయడానికి సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను బలహీనపరుస్తుంది. ఇది ప్రజాదరణ లేనిది, అస్థిరమైనది’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ బృందంతో వ్యాపార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశాలలో ఒకటిగా ఉండాలని భారతదేశం ఆశించింది. అయితే రష్యన్ చమురు కొనుగోళ్ల కారణంగా అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు ఐదు రౌండ్ల తర్వాత కూడా ముందుకు కదలలేదు.
Give the bully an inch, he will take a mile. pic.twitter.com/IMdIM9u1nd
— Xu Feihong (@China_Amb_India) August 7, 2025
వైట్ హౌస్‌లో చైనాపై సుంకాలు విధించే ప్రణాళిక గురించి మీడియా ట్రంప్‌ను అడిగినప్పుడు ఆయన తాను ఇప్పుడే ఏమీ చెప్పలేదనని, భారతదేశానికి ఏదైతే చేశామో.. బహుశా మరికొన్ని దేశాలతో కూడా అలాగే చేస్తామని, వాటిలో చైనా ఒకటి కావచని’ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు శుక్రవారం నాటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే, తాను ద్వితీయ సుంకాలను విధిస్తానని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా- అమెరికాల మధ్య సుంకాల యుద్ధం ప్రారంభమైంది. అమెరికా తన సుంకాలను 145 శాతానికి పెంచగా, చైనా తన సుంకాలను 125 శాతానికి పరిమితం చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ఈ ఏడాది చివర్లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.