
బీజింగ్: పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టంచేశారు. పాక్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఆయన శనివారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తాజా పరిణామాలను ఇషాఖ్ దార్ వివరించారు.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ నాయకత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని వాంగ్ యీ ప్రశంసించారు. పాక్ సంయమన ధోరణిని కొనియాడారు. మిత్రదేశమైన పాక్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌తోనూ ఇషాఖ్ దార్ ఫోన్‌లో మాట్లాడారు.