బంగారు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం

China Gold Mine Blast 10 died one missing 11 survivors - Sakshi

10 మంది మృతి.. 11 మంది సురక్షితం.. ఒకరు అదృశ్యం

బీజింగ్‌/ జినాన్‌: చైనాలోని షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న బంగారు గనిలో పేలుడు సంభవించిన రెండు వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. రెండువారాల పాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. జనవరి 10వ తేదీన బంగారు గనిలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగిన విషయం మాత్రం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. దీంతో బాధితులను కాపాడే ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. విషయం తెలిసిన అనంతరం హుటాహుటిన నిపుణులను తరలించి వారిని వెలికితీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే భూగర్భంలో నీటి తాకిడి భారీగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకంగా మారింది. గని ముఖద్వారంపై వెయ్యి అడుగుల లోతున 70 టన్నుల మట్టి కూరుకుపోవడంతో మరింత కష్టమైంది.

వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. లోపల ఉన్నవారి పరిస్థితిపై ఆందోళన చెందిన అధికారులు వీలైనంత త్వరగా బయటకు తీసుకొద్దామని ప్రయత్నించారు. రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తి ఆచూకీ లభించలేదు. అతడి కోసం అధికారులు వెతుకున్నారు. అయితే గనిలో పేలుడుకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో మైనింగ్‌ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా దాదాపు 5 వేల మంది మరణిస్తుంటారని ఆ దేశ మీడియా తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top