
బీజింగ్: పాకిస్తాన్‌కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జియాన్ వై–20 రకం విమానంలో పెద్ద మొత్తంలో సామగ్రిని పాకిస్తాన్ తరలించినట్లు ఆన్‌లైన్‌లో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొంది. ‘ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు.
సైనిక సంబంధమైన వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిని బాధ్యులను చేస్తాం’అని స్పష్టం చేసింది. భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరాక పాక్‌కు అత్యవసరమైన సామగ్రిని చైనా పంపించిందంటూ ఆన్‌లైన్‌లో వార్తలు షికారు చేశాయి. పాక్, చైనాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. పాక్ ఆయుధ సామగ్రి, వ్యవస్థల్లో ఏకంగా 81 శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవేనని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రి) తెలిపింది.