పేలుళ్లతో దద్దరిల్లిన సొమాలియా రాజధాని

పదుల సంఖ్యలో మృతి
మొగదిషు: సొమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోని జంక్షన్ వద్ద శనివారం రెండు కారు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులంతా పేలుడు సమయంలో అటుగా వాహనాలపై వెళ్తున్న పౌరులేనని మీడియా పేర్కొంది. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.
అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ తదితర ఉగ్రసంస్థలు రాజధాని లక్ష్యంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర సీనియర్ అధికారులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. సరిగ్గా ఇదే జోబ్ జంక్షన్‌లో 2017లో ఉగ్ర సంస్థ అల్ షబాబ్ అమర్చిన ట్రక్ బాంబు పేలి 500 మంది బలయ్యారు.