ఇస్లామాబాద్: చర్చలకు పాకిస్తాన్ వచ్చిన ఇరాన్ విమానంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువచ్చారు. మినాబ్ స్కూల్ మృతుల కోసం ఒక్కో సీటు కేటాయించారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కాగా.. ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల సంభవిస్తున్న మానవ ప్రాణ నష్టానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకుంటూ, ఘలీబాఫ్ ఇలా రాశారు: "ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు వీరే.. #Minab168" అంటూ ట్వీట్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్తున్న ఈ ప్రతినిధి బృందానికి 'మినాబ్ 168' అని పేరు పెట్టారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ పేరును నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "మినాబ్ చిన్నారులను మేము ఎప్పటికీ మర్చిపోము" అని రాసింది.

همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026
మినాబ్‌లో ఏం జరిగింది?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజున దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజరే తయ్యిబే' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక వైమానిక చిత్రాన్ని షేర్ చేశారు. అందులో "అమాయక" బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. అదే పోస్ట్‌లో అరాగ్చీ, ట్రంప్‌పై విమర్శలు చేస్తూ దీనిని 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్'(క్రూరమైన హత్య) గా అభివర్ణించారు.


