‘భారత్‌ టెక్నాలజీ వినియోగంలో ముందుంది’

Bill Gates Praises India Digital Finance Policies Becomes Model Of World - Sakshi

కౌలాలంపూర్: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సింగపూర్‌లో జరుగుతున్న ఫిస్‌ ఎటక్‌ ఫెస్టివల్‌ వర్చ్యువల్‌ విధానంలో మంగళవారం పాల్గోన్న ఆయన ఈ సందర్భంగా భారత ఆర్థిక విధానాన్ని ప్రశంసించారు. వినూత్న ఆర్థిక విధానాలను అవలంభించడంలో ఇండియా మిగతా దేశాల కంటే ముందు నిలిచిందన్నారు. అంతేగాక అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను భారత్ చక్కగా వినియోగిస్తోందని, ఒకవేళ చైనాను వదిలేసి మరో దేశంపై అధ్యయనం చేయాలనుకునే ప్రపంచ దేశాలు ఏవైనా తప్పనిసరిగా ఇండియాను ఎంచుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా ప్రపంచంలోని అతిపెద్ద బయో మెట్రిక్ డేటా బేస్ ఇప్పటికే భారత్‌లో సిద్ధమైందని, డబ్బు బట్వాడా బ్యాంకుల ద్వారా కాకుండా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా జరుగుతుండటం కూడా ఇండియాలో శరవేగంగా విస్తరిస్తోందన్నారు. అంతేగాక భారత ప్రభుత్వాలు సైతం పేదలందరికి సంక్షేమ పథకాలను దగ్గర చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!)

ఇక 2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత భారత్‌లో డిజిటల్ చెల్లింపులు ఎంతో పెరిగాయని, అవినీతిని నిర్మూలనకు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశం మొత్తం నగదు రహితంగా మార్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్ ఫేస్ సేవలు విస్తరించాయని తెలిపారు. వైర్‌లెస్ డేటా రేట్లు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నది కూడా ఇండియాలోనేనని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో స్మార్ట్ ఫోన్‌ల ధరలు సైతం తక్కువగా ఉన్నాయని, దీంతో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు కనిపిస్తున్నాయన్నారు. ఫేస్‌బుక్‌, అమెజాన్, వాల్ మార్ట్, పేటీఎం సహా అన్ని కంపెనీలు తమ సేవలకు యూపీఐ ప్లాట్ ఫాంను వాడటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని కితాబిచ్చారు. అయితే ఇదే తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎన్నో దేశాలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ప్రపంచమంతా పంపిణీ చేయగలదు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top