
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతీసిన మానసిక వేదన నుంచి బయటపడేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రామా రిలీఫ్, ధ్యానం,శ్వాసాభ్యాస కార్యక్రమాలు వేలాది మంది సైనికులు, స్థలచ్యుతులు, పిల్లలకు కొత్త ఆశను అందిస్తున్నాయి.
సైనికులకు నిర్వహించిన మొదటి శిక్షణ శిబిరాలు హృదయాన్ని కలచివేశాయి. “వారి చేతులు, కాళ్లు గాయాలతో నిండిపోయాయి. కళ్లలో భయం, ఖాళీతనం స్పష్టంగా కన్పించాయి” అని ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు తెలిపారు. అయితే శ్వాసాభ్యాసాలు నేర్చుకున్న తర్వాత సైనికులు “ప్రశాంతత, భద్రత, స్థిరత్వం”ను అనుభవించినట్లు చెప్పారు.
ఉక్రెయిన్ సైనిక నాయకత్వం గురుదేవ్ పనిని అధికారికంగా గుర్తించింది. బెటాలియన్ కమాండర్ స్వయంగా గురుదేవ్‌కు గౌరవ పురస్కారం అందజేస్తూ, “బాంబులు పడితే మేము పోరాడాము, కానీ మాలోని ఖాళీతనం, కోపం, ద్వేషం గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల తర్వాత మా జీవితాలు మారాయి. గాయాలతో ఉన్నవారే ఇప్పుడు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారు” అని పేర్కొన్నారు.
అంతేకాక, నాయకత్వ శిక్షణలు కూడా సైన్యానికి సహాయపడ్డాయి. “అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఈ శిక్షణ పెంచింది” అని సైన్యం అభినందించింది.
2014 నుండి సైన్యంలో మోరల్ అండ్ సైకాలజికల్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తున్న నటాలియా ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిన్న గుంతల్లో దాక్కున్న సైనికుల్లో ఒకరు భయంతో కదలలేకపోయిన పరిస్థితిని వివరించారు. “అప్పుడు అతనికి విజయ శ్వాస గుర్తొచ్చింది. అది అతని ప్రాణం మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రాణాలను రక్షించింది” అని ఆమె తెలిపారు.
2022 నుండి ఇప్పటి వరకు 8,000 మందికి పైగా సైనికులు, స్థలచ్యుతులు, ఆక్రమిత ప్రాంతాల పిల్లలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్లు ప్రమాదాలను లెక్క చేయకుండా సేవ చేస్తున్నారు. “అత్యవసరంగా అవసరమైన వారికి తోడుగా ఉండటం మాకు గౌరవం” అని ఒక ఇన్స్ట్రక్టర్ చెప్పారు.
యుద్ధం ఎన్నో ప్రాణాలు, కలలను తీసుకుపోయినా, గురుదేవ్ అందిస్తున్నది శాంతి, ఆశ, తిరిగి నిర్మించుకునే శక్తి. “శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం కాదు, కరుణ ఉనికిలో ఉండడం” అని ఆయన అన్నారు.
ఉక్రెయిన్‌లో చీకటి నడుమ వెలుగుకి మార్గం చూపుతున్న ఆ కరుణ ఇప్పుడు వేలాది హృదయాలకు ఆధారమవుతోంది.