Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్‌!

Published Wed, Mar 13 2024 8:56 AM

2024 US presidential election: After 70 Years Its Rematch - Sakshi

సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఆసక్తికర ఘట్టానికి అగ్రరాజ్యపు అధ్యక్ష ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. వరుసగా రెండోసారి కూడా.. అధ్యక్ష ఎన్నికల్లో అదే ఇద్దరు అభ్యర్థులు తలపడబోతున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌.. నవంబర్‌ 5వ తేదీన జరగబోయే 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది!.    

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థితత్వం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి నిలబడబోతున్నారు. నామినేషన్‌కు అర్హత సాధించాలంటే బైడెన్‌కు 1,968 డెలిగేట్స్‌ మద్దతు అవసరంకాగా..  ఆ ఫిగర్‌ను ఆయన దాటేశారని సమాచారం. తాజాగా వెలువడుతున్న ప్రైమరీ ఫలితాల్లో.. జార్జియా విజయంతో బైడెన్‌ ఆ ప్రతినిధుల సంఖ్యను అధిగమించేశారని తెలుస్తోంది. మరోవైపు మిసిస్సిప్పి, వాషింగ్టన్‌, నార్తన్‌ మరియానా ఐల్యాండ్స్‌ ఫలితాల్లోనూ బైడెన్‌ పైచేయి సాధించవచ్చని అమెరికా మీడియా అంచనా వేస్తోంది. 

1952, 1956 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫు అభ్యర్థి డ్వైట్ D. ఐసెన్‌హోవర్.. మాజీ ఇల్లినాయిస్‌ గవర్నర్‌(డెమొక్రటిక్‌) అడ్లై స్టీవెన్సన్‌ను రెండుసార్లూ ఓడించారు. తొలిసారి కంటే కంటే రెండో దఫా అధ్యక్ష ఎన్నికల్లో ఐసెన్‌హోవర్‌ మెరుగైన ఫలితంతో ఘన విజయం సాధించారు. 

2024 అధ్యక్ష ఎన్నికల్లో.. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌నకు 1,215 మంది ప్రతినిధులు అవసరం. అయితే  ఎడిసన్‌ రీసెర్చ్‌ ప్రకారం.. సోమవారం నాటికి ట్రంప్‌కు 139 మంది అదనపు ప్రతినిధులు అవసరం. అయితే జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి వాషింగ్టన్ రాష్ట్రాల్లో 161 మంది ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్ట్‌ ట్రంప్‌ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. వరుసగా రాష్ట్రాల్లో ప్రైమరీ ఫలితాల్లో విజయం సాధిస్తూ సమీప పత్యర్థి నిక్కీ హేలీపై ట్రంప్‌ పైచేయి సాధించారు. 15 రాష్ట్రాల్లో 14లో ఆయన విజయం సాధించగా.. గత మంగళవారం నాటి ఫలితాల తర్వాత హేలీ తన ప్రచారాన్ని ముగించిన సంగతి తెలిసిందే. 

అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవడానికి, పరోక్ష ఎన్నికలు(ప్రైమరీ) నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. ఇక్కడ ఓటర్లు ప్రతి పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధుల్ని నిర్ణయిస్తారు. ఆపై ఈ ప్రతినిధులు తమ తమ పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్రైమరీలలో.. పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను గెలవడానికి అభ్యర్థులకు సమావేశంలో ప్రతినిధుల ఓట్లలో మెజారిటీ అవసరం. అయితే.. నాలుగేళ్లకొకసారి అమెరికాలో జరిగేవి ప్రత్యక్ష ఎన్నికలే. అంతిమంగా బరిలో నిలిచే ఇరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసేది మాత్రం ప్రజలే. 

Advertisement

What’s your opinion

Advertisement