క్రిమినల్‌ ఖాకీలు! | - | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ ఖాకీలు!

Nov 27 2025 10:46 AM | Updated on Nov 27 2025 10:46 AM

క్రిమినల్‌ ఖాకీలు!

క్రిమినల్‌ ఖాకీలు!

అనేక నేరాలు, అవకతవకలకు పాల్పడుతున్న కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో

ఓ వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘరానా మోసగాడు ఉప్పలపాటి సతీష్‌తో ఒప్పందం చేసుకుని, కస్టడీ నుంచి ఎస్కేప్‌ కావడానికి సహకరించి టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై డి.శ్రీకాంత్‌ గౌడ్‌ సస్పెండయ్యారు.

● ఓ కేసులో రికవరీ చేసిన బంగారం తాకట్టు పెట్టడంతో పాటు తన సర్వీస్‌ పిస్టల్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంబర్‌పేట ఎస్సై భాను ప్రకాష్‌పై కేసు నమోదు కావడంతో పాటు వేటు పడింది.

● ఈ రెండు ఉదంతాలే కాదు.. ఇటీవల కాలంలో పోలీసులు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. హోదాలతో సంబంధం లేకుండా ఎవరికి వారుగా రెచ్చిపోతున్నారు. సీనియర్‌, ప్రమోటీలే కాదు... ఏకంగా డైరెక్ట్‌ రిక్రూటీలు అవినీతి, అవకతవకల ఆరోపణలు ఎదుర్కొవడం గమనార్హం. అధికారులు, సిబ్బంది ఎంపిక, వారికి ఇచ్చే శిక్షణ విధానాల్లో మార్పులు రావాలని, లేదంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

● ఈ వ్యవహారశైలి ఏ ఒక్క స్థాయిలో ఉందనుకుంటే పొరపాటే. కానిస్టేబుల్‌ (పీసీ) నుంచి ఎస్పీల వరకు ఎవరికి వారుగా రెచ్చిపోతున్నారు. చేతికి అందివచ్చిన, అవకాశం ఉన్న ఏ అంశాన్నీ వదులుకోవట్లేదు. భూ వివాదాల నుంచి నేరగాళ్లతో ములాఖత్‌ వరకు నచ్చినట్లు చేసుకుపోతున్నారు. ఒకప్పుడు కేవలం సీనియర్లు, ప్రమోటీలే

● ఈ పంఽథాలో వెళ్లే వారు. డైరెక్ట్‌ రిక్రూటీలు చాలా నిజాయతీగా, ముక్కుసూటిగా ఉండేవారు. ఈ నేపథ్యంలో తమ పరిధిలోని పోలీసుస్టేషన్లు, డివిజన్లు, జిల్లాల్లో డైరెక్ట్‌ ఎస్సైలు, డీఎస్పీలు, ఎస్పీలకు పోస్టింగ్‌ ఇవ్వడానికి రాజకీయ నాయకులు అంగీకరించే వాళ్లు కాదు. ఇటీవల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరికి వారు కేవలం ధనార్జనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. వివాదాల్లో ఇరుక్కుని భవిష్యత్తును నాశనం చేసుకోవడంతో పాటు పోలీసు విభాగాన్నీ చులకన చేస్తున్నారు.

వీళ్లు చేయడం మరింత ఘోరం..

సాధారణ వ్యక్తులు నేరం చేయడం వేరు... చట్టాన్ని అమలు చేసే పోలీసులు చేయడం వేరన్నది నిపుణులు మాట. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లు నేరాలు చేస్తే సాధారణ వ్యక్తులకు విధించే శిక్షకు రెట్టింపు అనుభవించడానికి అర్హులు. పైగా వ్యవస్థలోని ఓ వ్యక్తి చేసిన తప్పు ప్రభావం మొత్తం వ్యవస్థపై ఉంటుంది. ప్రభుత్వంపై ప్రజలకు ఉండే అభిప్రాయానికి పోలీసులే పునాది. అలాంటి విభాగంలో ఇన్ని వివాదాలు చెలరేగడం పరోక్షంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తోంది. ‘జిల్లా, జోన్‌, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోలీసులు ఎంపిక విధానంలోనే లోపాలు ఉన్నాయి. కేవలం విద్యార్హత, శారీరక దారుఢ్యం, మౌఖికంగా చెప్పే అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వారి వ్యక్తిత్వం, మానసిక స్థితి తదితరాలను పక్కాగా అంచనా వేయలేకపోతున్నారు. ఎంపికై న వారికి ఇచ్చే శిక్షణాంశాల్లోనూ మార్పులు రావాలి’ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఏడాది వెలుగులోకి వచ్చినవి ఇలా..

● రికవరీ చేసిన ద్విచక్ర వాహనం మాయం కావడం, హత్య కేసులో భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం వంటి ఆరోపణలపై ఓ ఠాణాలో పని చేసిన ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైలపై వేటు పడింది.

● వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో మరో ఠాణా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు క్రైమ్‌ కానిస్టేబుళ్లు సస్పెండయ్యారు.

● ఓ స్నేహితుడికి అక్రమంగా మరో వ్యక్తి లొకేషన్‌ ఇచ్చిన ఆరోపణలపై ప్రత్యేక విభాగంలో పని చే సిన ఏసీపీని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

● సివిల్‌ వివాదాల్లో తలదూర్చారంటూ వరుస వివాదాలు చుట్టుముట్టడంతో ఓ పోలీసుస్టేషన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌పై (ఎస్‌హెచ్‌ఓ) సస్పెన్షన్‌ వేటు పడింది.

● ప్రముఖులతో ముడిపడి ఉన్న అత్యాచారం, డ్రగ్స్‌ కేసుల దర్యాప్తులో అలసత్వం, అనుమానితులకు సహకరించడం ఆరోపణలపై ఓ ఠాణా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌ అయ్యారు.

● ఇవే కాకుండా వరకట్న వేధింపులు, మోసం, మహిళలను వలలో వేసుకోవడం సహా అనేక ఆరోపణలపై ఎంతో మందిపై కేసులు నమోదు కాగా, కొందరు అరెస్టయ్యారు.

మొన్న టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ,

తాజాగా అంబర్‌పేట ఎస్‌ఐ

పీసీ నుంచి మొదలు ఎస్పీల వరకు ఇదే పంథా

వరుసగా వెలుగు చూస్తున్న వీరి దందాలు

ఎంపిక, శిక్షణలో మార్పులు వస్తేనే మార్పు: నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement