బెస్ట్ సిటీ.. హైదరాబాద్ !
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక నగరంగా అటు చార్మినార్, గోల్కొండ కోటల అందాలు, ఆధునిక నగరంగా ఇటు హైటెక్‌సిటీ, ఐటీ, ఫార్మా రంగాలు.. ఆర్థికంగా ఉపకరించే స్టార్టప్‌లు, ఇన్నోవేషన్లు ,తదితరమైనవి కలిసి హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నగరాల జాబితాలో స్థానం కల్పించాయి. రెసోనెన్స్ కన్సల్టెన్సీ విడుదల చేసిన వరల్డ్స్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్(2025–26)లో హైదరాబాద్‌కు 82వ స్థానం లభించింది. నగరానికున్న చరిత్రతో పాటు టెక్నాలజీ వినియోగం, జీవనప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, తదితరాలు ఇందుకు ఉపకరించాయి. లండన్, న్యూయార్క్, ప్యారిస్, తదితర గ్లోబల్ మెట్రోపాలిటన్‌లు ఈ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాలు దక్కించుకున్నాయి. మన దేశం విషయానికొస్తే బెంగళూరు, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్ వాటి సరసన చేరింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న 270కి పైగా దేశాల్లో అంశాల వారీగానూ ఆయా ర్యాంకింగ్‌లతో పాటు సిటీల జాబితాలో నగరానికి బెస్ట్‌సిటీగా 82వ ర్యాంక్ లభించింది. ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ నగరాల్లో హైదరాబాద్ నిలిచింది. లివబిలిటీ, లవబిలిటీ, ప్రాస్పరిటీ ప్రాతిపదికన బెస్ట్‌సిటీలను ఎంపిక చేశారు.
సాంస్కృతిక, చారిత్రక వైభవం
హైదరాబాద్ అనగానే మదిలే మెదిలే చారిత్రక,వారసత్వ సంపదలైన చార్మినార్, లాడ్‌బజార్,గోల్కొండ కోట,మక్కా మసీదు వంటి ఐకానిక్ ప్రదేశాలు సైట్స్‌అండ్ ల్యాండ్‌మార్క్స్ విభాగంలో నగరాన్ని టాప్–2గా నిలిపాయి.లాడ్‌బజార్, ముత్యాలు, నగల దుకాణాలు వంటివి షాపింగ్ విభాగంలో 20వ స్థానంలో ఉంచాయి.
టెక్నాలజీ, బిజినెస్ హబ్‌గా
హైటెక్‌సిటీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్యాంపస్, అమెజాన్ టెక్‌స్పేస్‌లతో పాటు పలు ఫార్చూన్ కంపెనీలు, జీనోమ్ వ్యాలీలోని బయోటెక్, ఫార్మా కంపెనీలు నగరానికి ర్యాంక్ రావడంలో ఉపయోగపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న వ్యాక్సిన్లలో మూడింట ఒకవంతు ఇక్కడే ఉత్పత్తి కావడంతో ఈ రంగంలో గుర్తింపు లభించింది.
ఇన్నోవేషన్, స్టార్టప్స్
స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న టీ–హబ్ ప్రపంచంలో పేరెన్నికగన్న ఇన్నోవేషన్ క్యాంపస్‌గా గుర్తింపు పొందింది. భవిష్యత్‌లో రానున్న ఫార్మాసిటీ ప్రాజెక్స్, మెట్రోరైలు విస్తరణలతో నగరం మరింతగా అభివృద్ధి చెందనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్బన్ ప్లానింగ్‌లో మున్ముందు చోటు చేసుకోనున్న మార్పులు, రవాణా సదుపాయాలు, తదితరమైన వాటితో మరింత అభివృద్ధికి అవకాశం ఉందన్నారు.
నగరం ర్యాంక్
బెంగళూర్ 29
ముంబై 40
ఢిల్లీ 54
హైదరాబాద్ 82
ప్రపంచంలోని 100 ఉత్తమ నగరాల్లో ఒకటిగా..
భాగ్యనగరానికి 82వ స్థానం
జీవన ప్రమాణాలు
మిగతా నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండటం,ఐటీ, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగులు, కార్మికుల వలసలు, కాస్మోపాలిటన్ కల్చర్, బిర్యానీతో పాటు ఇక్కడి నోరూరించే వివిధ రకాల వంటకాలు లవబిలిటీ విభాగంలో నగరానికి గుర్తింపు తెచ్చాయి.


