కటకటాల్లోకి నకిలీ ఐఏఎస్ అధికారి
బంజారాహిల్స్: కారుకు అధికారిక వాహనంలాగ స్టిక్కర్.. సైరన్.. ఇద్దరు బాడీగార్డులు.. నకిలీ గుర్తింపుకార్డు.. వాకీటాకీలు.. డాబూ..దర్పంతో వెలిగిపోతూ తాను ఐఏఎస్ అధికారినని కొన్ని చోట్ల, ఐపీఎస్ అధికారినని మరికొన్ని చోట్ల చెలామణి అవుతూ అమాయకుల నుంచి పనులు చేయిస్తానని లక్షలాది రూపాయలు దండుకున్న నకిలీ ఐఏఎస్ అధికారిని ఫిలింనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కర్నూలు జిల్లా నందికొట్కూర్‌కు చెందిన బత్తిని శశికాంత్ (39) బీకామ్ వరకు చదివాడు. ఉద్యోగాన్వేషణలో విఫలమయ్యాడు. ఎలాగైనా అధికారిగా బతకాలని, డాబుసరితో చెలామణి అవ్వాలని కోరిక కలిగింది. ఇందుకోసం ఖరీదైన సూటూ.. బూటూ కొనుగోలు చేశాడు. తాను ఐఏఎస్ అధికారినని షేక్‌పేటలోని గోల్డ్ జిమ్ ఎండీ అలీ హసన్‌ను పరిచయం చేసుకున్నాడు. పనులు చేసి పెడతానంటూ నమ్మించాడు. తాను ఇండస్ట్రియల్‌కు చెందిన టీఎస్‌ఐఐసీలో ఉన్నానని, అక్కడ ఇండస్ట్రియల్ ల్యాండ్ కేటాయిస్తానని రూ.10.50 లక్షలు తీసుకున్నాడు. ఓ కారు కొనుగోలు చేసి దానికి ప్రభుత్వ వాహనమనే స్టిక్కర్‌ను, నకిలీ గుర్తింపుకార్డు తగిలించాడు. సైరన్ అమర్చాడు. ఇద్దరు బాడీగార్డులను ఏర్పాటుచేసుకున్నాడు. వారికి వాకీటాకీలు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్లినా ఐఏఎస్ అధికారిగా డాబుసరి వెలగబెట్టేవాడు. చాలామంది నమ్మారు. కొన్నిచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థలో ఐపీఎస్ అధికారినని చెప్పుకున్నాడు. ఏ పని కావాలన్నా చిటికెలో చేసి పెడతానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి ఫేక్ లెటర్లు ఇచ్చేవాడు. మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నానని మరికొందరిని నమ్మించాడు. అయితే నిందితుడు ఇచ్చిన ల్యాండ్ అలాట్‌మెంట్ లెటర్ బోగస్ అని తేలడంతో గోల్డ్‌జిమ్ యజమాని అలీ హసన్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఫిలింనగర్ ఇన్‌స్పెక్టర్ సంతోషం సిబ్బందితో కలిసి పక్కా స్కెచ్ వేసి నిందితుడి కదలికలపై దృష్టి సారించారు. షేక్‌పేటలోని అపర్ణ ఔరా అపార్ట్‌మెంట్స్‌లో నిందితుడు ఖరీదైన ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉంటున్నట్లుగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నకిలీ ఐఏఎస్ అధికారి బత్తిని శశికాంత్‌ను అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. బాడీగార్డులుగా చెలామణి అయిన ప్రవీణ్, విమల్ అనే ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకట్‌రెడ్డి, ఫిలింనగర్ ఇన్‌స్పెక్టర్ సంతోషం తదితరులు పాల్గొన్నారు.
పలువురిని మోసం చేసిన కర్నూలు జిల్లా వాసి


