వీడిన కూలీ అదృశ్యం మిస్టరీ
హుస్సేన్‌సాగర్ నాలాలో పడి మూసీలో తేలాడు
అంబర్‌పేట: చెట్లకు నీరు పడుతుండగా పొరపాటున హుసేన్‌సాగర్‌లో పడి.. ఆతరువాత మూసీలో శవమై తేలాడు. పనికి పిలిచిన వ్యక్తి... తోటి కూలీలు అతని అదృశ్యం గురించి పట్టించుకోకుండా మానవత్వాన్ని విస్మరించారు. చివరకు మూసీలో శవమై తేలాక మిస్టరీ వీడింది. ఈ సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపిన మేరకు.. కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రత్నా నగర్‌లో పొడగట్టి సైదులు(50) భార్య రేణుక, ఇద్దరు కూతుళ్లు శిరిష, శివానిలతో కలిసి ఉంటున్నాడు. సైదులు ఈ నెల 22న కూలీ కోసం రత్నానగర్ ఎదురుగా ఉన్న ఇసుక, కంకర అమ్మే అడ్డామీదకు వచ్చాడు. రోడ్ల వెంట ఉన్న చెట్లకు నీరు పట్టేందుకు ఓ ట్యాంకర్ యాజమాని మరో ఇద్దరు కూలీలతో కలిసి తీసుకువెళ్లాడు. ఫీవర్ ఆస్పత్రి నాలపై ఉన్న మొక్కలకు నీరు పట్టే క్రమంలో సైదులు హుస్సేన్ సాగర్ నాలాలో పడిపోయాడు. అతను పడిపోయిన విషయాన్ని పట్టించుకోకుండా ఎక్కిడి వారు అక్కడే జారుకున్నారు. రాత్రి వరకు సైదులు కోసం వేచి చూసిన భార్య రేణుక కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగ మంగళవారం సైదులు మృత దేహం గోల్నాక కొత్త బ్రిడ్జి వద్ద లభించడంతో అంబర్‌పేట పోలీసులు తొలుత గుర్తు తెలియని మృత దేహాంగా స్వాధీనం చేసుకుని పోస్టుమర్టం తరలించారు. బుధవారం విచారణలో మృతుడు సైదులుగా తేలింది.


