బైక్‌పై సీఎండీ బస్తీబాట!
ఎల్సీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
సాక్షి, సిటీబ్యూరో: పెండింగ్‌లో ఉన్న విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఇంజినీర్లకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. నూతన సర్వీసులు, టైటిల్ ట్రాన్స్‌ఫర్, సోలార్ నెట్ మీటరింగ్, పీఎం సూర్యఘర్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన ఇంజినీర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా గురువారం పాతబస్తీలోని మెఘల్‌పురా, బేహరుపియాబస్తీ, గొల్లఖిడికి బస్తీల్లో ఆయన బైక్‌పై పర్యటించారు. ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ నరహింహులును వెనుక సీట్లో కూర్చొబెట్టుకుని ఆయన బైక్ నడుపుతూ మార్గంమధ్యలో పలువురు వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 593 ఎల్‌టీఎం(అపార్ట్‌మెంట్లు/ లే అవుట్ల) దరఖాస్తులపై సమీక్షించారు. కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులంతా శనివారం ఇస్తున్న లైన్ క్లియరెన్స్(ఎల్సీ)లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక నుంచి వారానికి ఒక రోజు (శనివారం) మాత్రమే ఎల్సీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎల్సీ ఇచ్చిన సమయంలోనే లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లకు రిపేర్లు, ఏబీ స్విచ్‌లకు మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


