
పురస్కారం అందుకున్న అనంతరం ఇలంబర్తి కర్ణన్ తదితరులు
ప్రామిసింగ్ క్లీన్‌సిటీగా రాష్ట్రస్థాయి పురస్కారం
‘గార్బేజ్ ఫ్రీ’లో నగరానికి 6వ ర్యాంక్
సెవెన్ స్టార్ రేటింగ్ సైతం
వాటర్‌ప్లస్ రీ సర్టిఫికేషన్
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటిలాగే ఈసారి కూడా జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ ర్యాంకింగ్ అవార్డుల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్–2024 ర్యాంకింగ్స్‌లో ‘ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ ఆఫ్ తెలంగాణ’గా రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకింగ్‌తో నిలిచింది. పది లక్షల జనాభా మించిన నగరాల గార్బేజ్ ఫ్రీ సిటీస్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 44 నగరాల్లో 6వ ర్యాంక్ పొందింది. గత ఏడాది 9వ ర్యాంక్ వచ్చింది.
గతంలో ఉన్న ఫైవ్ స్టార్ రేటింగ్‌ను దాటి ఈసారి సెవెన్ స్టార్ రేటింగ్‌ను సాధించింది. వాటర్ ప్లస్ సిటీ హోదాను వరుసగా నాలుగోసారీ నిలబెట్టుకుంది. మొత్తం ఎనిమిది అంశాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ ఏడు అంశాల్లో వందశాతం మార్కులు పొందింది. వీటిలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ, వ్యర్థాల ప్రాసెసింగ్, డంప్‌సైట్‌ల నివారణ, నివాస ప్రాంతాల పరిశుభ్రత, మార్కెట్ ప్రాంతాల్లో శుభ్రత, చెరువుల శుభ్రత, పబ్లిక్ టాయ్‌లెట్ల పరిశుభ్రత ఉన్నాయి. ఉత్పత్తి చోటే చెత్త వేరే చేసే ప్రక్రియలో మాత్రమే 93 శాతం మార్కులు వచ్చాయి. మొత్తం 12,500 మార్కులకుగాను జీహెచ్‌ఎంసీ 11,805 మార్కులు సాధించింది.
గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా మున్సిపల్ శాఖ సెక్రటరీ కె.ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అవార్డు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ (పారిశుధ్యం–ఆరోగ్యం), ఘనవ్యర్థాల నిర్వహణ విభాగం ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్‌బీఎం యశశ్రీరెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ సుదర్శన్, పారిశుధ్య కార్మికురాలు ఊర్మిళ పాల్గొన్నారు. ఘనవ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం, ప్రజలకు అవగాహన తదితర అంశాలతో చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు స్టార్ రేటింగ్స్‌ను ప్రవేశపెట్టారు.
ప్రజల ఆశ్చర్యం..
గ్రేటర్ నగరానికి ఆయా అంశాల్లో వంద శాతం మార్కులు రావడం చూసి నగర ప్రజలు నివ్వెరపోతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ టాయ్‌లెట్లు, మార్కెట్ ప్రాంతాలు, చెరువుల శుభ్రత అంశాల్లో ఈ మార్కులు చూసి ఇది నిజమేనా అంటూ నమ్మలేకపోతున్నారు.
మా బాధ్యత మరింత పెంచింది మేయర్, డిప్యూటీ మేయర్ హర్షం
జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సాధించిన సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత హర్షం వ్యక్తం చేశారు. అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ స్ఫూర్తితో గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యకరమైన అంశంలో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తామన్నారు. అవార్డు రావడంలో కీలక పాత్ర పోషించిన కమిషనర్, అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు సైతం..
కంటోన్మెంట్: గ్రేటర్ పరిధిలోనే ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా కంటోన్మెంట్ బోర్డుల కేటగిరీలో మొదటి ర్యాంక్ పొందింది. ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కింది. ఢిల్లీలోని విజ్జాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేతుల మీదుగా కంటోన్మెంట్ సీఈఓ మధుకర్‌నాయక్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ సీఈఓ పల్లవి విజయ్‌వన్షీ, కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, బోర్డు సభ్యురాలు భానుక నర్మద తదితరులు పాల్గొన్నారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, సానిటేషన్ విభాగాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో ఈ అవార్డుకు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. బోర్డు సిబ్బంది, ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందని సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకుంటున్న స్రికింద్రాబాద్ కంటోన్నెంట్ అధికారులు