
ట్రాఫిక్ పోలీసులపై కోర్టుకెక్కిన మోటార్‌సైక్లిస్ట్..
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు ఇదే సందు అదే సందు అన్నట్టుగా పెరుగుతున్న చలానాల వడ్డింపు కూడా తరచు చర్చనీయాంశంగా మారుతోంది. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మ్‌ట్ రహిత డ్రైవింగ్.... తదితర ఉల్లంఘనల పట్ల బాగా కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. కేసులు రాయడంతో పాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఈ పరిస్థితి ద్విచక్రవాహనదారులకు తీవ్ర సంకటంగా మారింది.
మోటార్ సైక్లిస్ట్స్ లలో సాధారణంగా దిగువ మధ్య తరగతివారే అధికం కావడంతో భారీ మొత్తంలో జరిమానాలను భరించలేక తరచుగా వారు గొడవలకు నిరసనలకు దిగుతుండడం అలాంటి ఘర్షణల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండడం కూడా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కున్న ఒక ద్విచక్ర వాహనదారుడు తనకు విధించిన జరిమానాపై ఏకంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇలా పెద్ద మొత్తంలో ఇష్టా రాజ్యంగా జరిమానాలు విధించడం అంటే అది మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనే అని పిటిషనర్ ఆరోపించారు.
హైదరాబాద్ నగరానికి చెందిన రాఘవేంద్ర చారి అనే ప్రైవేట్ ఉద్యోగి 2025 నంబర్ 26655న ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు, గత మార్చి 17న ఇద్దరు అదనపు రైడర్లతో (ట్రిపుల్ రైడింగ్) కలిసి ప్రయాణించిన కారణంగా తనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు) విధించిన జరిమానాను ఆయన కోర్టులో సవాల్ చేశారు. చట్టంలో అనుమతించబడిన జరిమానాలకు మించి చలాన్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు.
వాస్తవానికి ద్విచక్ర వాహన నేరానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 100–రూ. 300 మాత్రమే జరిమానా విధించాల్సి ఉండగా రూ. 1,200 కట్టమని ఆదేశించడాన్ని ఆయన తప్పు పట్టారు. తనకు రూ. 1,200 మొత్తం జరిమానాగా విధించారని అయితే మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 177 అటువంటి నేరానికి చాలా తక్కువ జరిమానాను నిర్దేశిస్తుందని, కాబట్టి ఈ జరిమానా చట్టవిరుద్ధమని ఆయన వాదిస్తున్నారు.
‘వాహనదారులలో భయాన్ని కలిగించే ఉద్దేశ్యంతో వేల రూపాయల చట్టవిరుద్ధ చలాన్లు విధించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది అని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ ఆక్షేపించారు.
‘‘చట్టం ద్వారా అనుమతించబడిన జరిమానాలకు మించి ఏ పౌరుడిని శిక్షించలేం. అయితే ఆదాయాన్ని సంపాదించాలనే దురుద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడం మర్చిపోయి వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన విమర్శిస్తున్నారు. ఈ పిటిషన్‌ను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు చట్టబద్ధమైన పరిమితులను మించి జరిమానాలు ఎందుకు విధిస్తున్నారో వివరణ సమర్పించడానికి హోంశాఖకు, ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఒక వారం గడువు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఇలాంటి అధిక జరిమానాల పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్న పలువురు వాహనదారుల ను ఈ పిటిషన్ ఆకర్షిస్తోంది. తెలంగాణలో ట్రాఫిక్ జరిమానాలు అమలు తీరుతెన్నులపై హైకోర్టు నుంచి భవిష్యత్తు రాబోయే నిర్ణయం ప్రభావితం చేయనుందని చెప్పొచ్చు.