
నాలా విస్తరణను కొనసాగించండి
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని నాలాలను గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. రోడ్డునెంబర్– 3, 14లలో తలెత్తుతున్న వరద సమస్యకు కారణాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. రోడ్డు నెంబర్–3లోని జ్యోతినెస్ట్ నివాసితులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కేబీఆర్ పార్కు, నందినగర్ మీదుగా బంజారాహిల్స్ నుంచి జలగం వెంగళరావునగర్ పార్కులోని చెరువులోకి చేరే వరద కాల్వను ఆయన పరిశీలించారు. ఎగువన 4 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3 వద్దకు వచ్చేసరికి కొన్నిచోట్ల 2 మీటర్లకే పరిమితవడాన్ని గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14తో పాటు 3లోనూ నాలాలు కుంచించుకుపోవడాన్ని పరిశీలించారు. బఫర్ లేకుండా చేయడంతో పాటు నాలాను ఆక్రమించడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ నుంచి చివరి వరకూ నాలా వెడల్పును పరిశీలించి వరద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
అధికారులతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్