జీడిమెట్ల ఏటీఎం చోరీ కేసులో వీడిన మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

జీడిమెట్ల ఏటీఎం చోరీ కేసులో వీడిన మిస్టరీ

Jul 18 2025 1:33 PM | Updated on Jul 18 2025 1:33 PM

జీడిమెట్ల ఏటీఎం చోరీ కేసులో వీడిన మిస్టరీ

జీడిమెట్ల ఏటీఎం చోరీ కేసులో వీడిన మిస్టరీ

జీడిమెట్ల: గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి రూ.34.71లక్షలు దోచుకువెళ్లిన అంతర్రాష్ట్ర ముఠా ను జీడిమెట్ల, బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. గురువారం సైబరాబాద్‌ సీపీ కార్యాలయంలో బాలానగర్‌ డీసీపీ సురేష్‌కుమార్‌, క్రైం డీసీపీలు ముత్యంరెడ్డి, రామ్‌కుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 8న షాపూర్‌నగర్‌, మార్కాండేయనగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చొరబడిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరా వైర్లను కత్తిరించారు. అనంతరం తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఏం మిషన్‌ను కట్‌ చేసి అందులో ఉన్న రూ.34.71లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు..

ఈ కేసులో దొంగలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖాలకు మాస్కులు ధరించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన వాహనాలను ఈ చోరీకి ఉపయోగించారు. అనంతరం బైకులపై నర్సాపూర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, అదిలాబాద్‌, నాగ్‌పూర్‌, మీదుగా హరియాణాకు పారిపోయారు. వీరు సెల్‌ఫోన్‌లు కూడా వాడకుండా జాగ్రత్త పడ్డారు. చోరీ అనంతరం గ్యాస్‌ కట్టర్‌లు, సిలిండర్లను జీడిమెట్ల డిపో వద్ద పారవేశారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫతేనగర్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఒకడైన అమేర్‌ అన్సారీని గుర్తించారు. గతంలో అతను మెట్కానిగూడలో ఉండేవాడని, ప్రస్తుతం అతడి కుటుంబ సభ్యులు బేగంపేట ప్రకాష్‌నగర్‌లో హాస్టల్‌ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని వారి ద్వారా కూపీ లాగారు. దీంతో ఒక బృందాన్ని హరియాణాకు పంపారు. పోలీసులు తమ కోసం ఆరా తీస్తున్నట్లు తెలుసుకున్న దొంగలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అమేర్‌ అన్సారీ ఇంట్లో తలదాచుకున్నారు. గురువారం ఉదయం అమేర్‌ అన్సారీ, యాసీద్‌ హుస్సేన్‌, మహ్మద్‌ అబేద్‌ నెంబర్‌ ప్లేట్‌లేని బైక్‌పై వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ.17లక్షల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో దొంగ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మధ్యప్రదేశ్‌ జైల్‌లో పరిచయం..

హైదరాబాద్‌కు చెందిన అమేర్‌ అన్సారీ గతంలో మధ్యప్రదేష్‌కు చెందిన బాలికను ఇన్‌స్టా ద్వారా ట్రాప్‌ చేసి నగరానికి రప్పించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసునమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో జైలులో ఉన్న అతడికి ఇప్పటికే పదుల సంఖ్యలో చోరీలు చేసి జైలులో ఉన్న , యాసీద్‌ హుస్సేన్‌, మహ్మద్‌ అబేద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌, డీఐ కనకయ్య, బాలానగర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌లను డీసీపీ అభినందించారు.

ముగ్గురు దొంగల అరెస్ట్‌

పరారీలో మరొకరు

రూ.17లక్షల నగదు,నాలుగు బైక్‌లు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement