
బస్సు డ్రైవర్ పై దాడి
మియాపూర్: బస్సులో సిగరేట్ తాగవద్దన్నందుకు ఓ ప్రయాణికుడు బస్సు డ్రైవర్‌తో గొడవపడి తన స్నేహితులతో కలిసి అతడిపై దాడిచేసి రూ. లక్ష నగదు లాక్కెళ్లారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఐ రమేష్ నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నింబోలి అడ్డాకు చెందిన పప్పురామ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. అతను హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌కు ప్రైవేటు బస్సు నడిపేవాడు. ఈ నెల 12న రాత్రి ప్రయాణికులను ఎక్కించుకుని రాజస్థాన్ బయలుదేరాడు. ఎల్‌బీనగర్‌లో ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రం, జోద్‌పూర్ జిల్లా కు చెందిన పూనారామ్ తన సొంత ఊరికి వెళ్లేందుకు పప్పురామ్ ట్రావెల్ బస్సులో ఎక్కాడు. బస్సులో పునరామ్ సిగరేట్ తాగుతుండడంతో పప్పురామ్ అతడిని వారించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన పునరామ్ బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. అంతేగాక నగరంలో ఉంటున్న తన స్నేహితులు మహిపాల్, నారాయణ రామ్, వికాస్ విష్ణోయ్, కై లాష్‌తో పాటు మరో ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రాత్రి 10 గంటలకు వారు మదీనాగూడలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద బస్సును అడ్డుకుని డ్రైవర్ పప్పురామ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. అతడి నుంచి రూ. లక్ష నగదు లాక్కుని పరారయ్యారు. డ్రైవర్ పప్పురామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు గురువారం ప్రధాన నిందితుడు పునరామ్‌తో పాటు అతడి స్నేహితులు మహిపాల్, నారాయణరామ్, వికాస్, కై లాష్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులు వికాస్, మనుపాల్, ఫకియాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
● రూ. లక్ష నగదు చోరీ ● ఐదుగురు నిందితుల అరెస్ట్
● బస్సులో సిగరేట్ తాగవద్దన్నందుకు గొడవ