మత్తెక్కిస్తున్న విష రసాయనాలు | - | Sakshi
Sakshi News home page

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు

Jul 11 2025 12:47 PM | Updated on Jul 11 2025 12:47 PM

మత్తె

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు

కుదేలవుతున్న పేదల జీవితాలు

గాల్లో అమాయకుల ప్రాణాలు

మామూళ్ల మత్తులో అధికారులు

ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారులు

కుదిపేసిన కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన

ఏడుగురికి చేరిన మృతుల సంఖ్య

ఆస్పత్రుల్లో 45 మందికి చికిత్సలు

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నర్సమ్మ

కూకట్‌పల్లి:

కూకట్‌పల్లి సర్కిల్‌, బాలానగర్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ల పరిధిలోని కల్లు దుకాణాలలో కల్తీ కల్లు విక్రయించటంతో అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఏడుగురు మృత్యువాత పడగా నిమ్స్‌తో పాటు వివిధ ఆస్పత్రుల్లో సుమారు 45 మంది చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరేచనాలతో, జ్వరాలతో ఆస్పత్రుల పాలైన వారు ఒక్కొక్కరుగా మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం ఆరుగురు మృత్యువాత పడగా గురువారం హైదర్‌నగర్‌ సాయిచరణ్‌ కాలనీకి చెందిన నర్సమ్మ (54) తీవ్ర అస్వస్థతకు గురై ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

కూలిపనులు చేసుకుంటున్న వారే..

హైదర్‌నగర్‌, శంషీగూడ, నిజాంపేట్‌, అడ్డగుట్ట, ఇందిరా హిల్స్‌, నడిగడ్డ తండా, వసంత్‌నగర్‌, ఎల్లమ్మబండ తదితర కాలనీల్లో పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి కూలిపనులు చేసుకుంటున్న వారే అధికంగా నివసిస్తుంటారు. వీరు తక్కువ ధరలో కల్లు దొరకటంతో పాటు మత్తు ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో కల్లుకు అలవాటు పడ్డారు. ప్రతి రోజు ఆయా ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్లు తాగుతుంటారు. వీరిని ఆసరాగా చేసుకుని కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు కల్లును కల్తీ చేస్తున్నారు. పేద, మద్య తరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రమాదకరమైన క్లోరల్‌ హైడ్రేట్‌, డైజోఫాం, సిట్రిక్‌ యాసిడ్‌ వంటి రసాయనాలు నగర శివారులోని పారిశ్రామికవాడ నుంచి దొంగచాటున కొనుగోలు చేసి కల్తీ కల్లులో ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు..

ప్రతి నెలా టంచన్‌గా దుకాణాలను సందర్శించే అధికారులు, సిబ్బంది కేవలం మామూళ్ల లెక్కలను చూసుకుని కాగితాల్లో శాంపిల్స్‌ సేకరించినట్లు కల్లు స్వచ్ఛత గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించటం పరిపాటిగా మారింది. బాలానగర్‌ ఎకై ్సజ్‌ అధికారులు మూడు రోజులుగా ఏ ఒక్కరికి కనీసం సమాధానం చెప్పకుండా స్థానికంగా ఎవరికీ అందుబాటులో లేకుండా మొహం చాటేస్తూ తిరుగుతున్నారు. కనీసం ప్రజాప్రతినిధులకు కూడా ఎలాంటి సమాధానం చెప్పటం లేదు. దీనిని బట్టి ఎకై ్సజ్‌ అధికారులకు కల్లు దుకాణ యజమానులతో బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. న కిలీ గీత కార్మికులు నగరంలోని పలు మురికివాడల్లో ఒక షాపు అనుమతి తీసుకుని అనేక బ్లాక్‌ అడ్డాల్లో కల్తీ కల్లును విక్రయిస్తున్నారని ఆరోపణలున్నాయి.

మాఫియాను గుర్తించాలి..

అమాయకుల జీవితాలతో చెలగాటమాడే కల్తీ కల్లు మాఫియాను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కల్లు గీత కార్మికులకు తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే పరీక్షలు పెట్టి వారిని గుర్తించాలని, వారికి మాత్రమే కల్లు అమ్ముకునేలా దుకాణాల లైసెన్స్‌లు మంజూరు చేయాలని పలువురు డిమాండు చేస్తున్నారు. కాంపౌండ్‌లోని కల్లును ఎప్పటికప్పుడు తనిఖీ చేసి చార్ట్‌లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

కల్లు దుకాణాల మూసివేతతో వింత ప్రవర్తనలు..

కల్తీ కల్లు విషాదాంతం కారణంతో అధికారులు దుకాణాలు మూసివేయించారు. దీంతో రోజూ కల్లు తాగే ప్రజలు వీటి వద్ద వేచి చూస్తున్నారు. మరికొందరు పిచ్చిగా ప్రవర్తిస్తూ పడిపోతున్నారు. ఇంకొందరు కల్లు దొరక్క వైన్‌ షాపుల్లో దొరికే చీప్‌ లిక్కర్‌కు తాగుతున్నారు. గురువారం పలు కల్లు దుకాణాలు మూసివేయటంతో.. ఎల్లమ్మబండలోని కల్లు కాంపౌండ్‌కు తాకిడి పెరిగింది.

ఎకై ్సజ్‌ అధికారుల దాడులు..

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనతో ఎకై ్సజ్‌ శాఖ అప్రమత్తమైంది. 7 బృందాలుగా ఏర్పడి బాలానగర్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌నగర్‌ దాని అనుబంధ హెచ్‌ఎంటీ కాలనీ, సర్దార్‌ పటేల్‌ నగర్‌, కేపీహెచ్‌బీ భాగ్యనగర్‌ కాలనీల్లోని కల్లు దుకాణాల్లో నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆల్ఫ్రాజోలం అనే మత్తు మందును కల్తీ చేసినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చారు. సంబంధిత కల్లు కాంపౌండ్ల యజమానులు కూన రవితేజ గౌడ్‌, నాగేష్‌ గౌడ్‌, కూన సాయితేజ గౌడ్‌, భట్టి శ్రీనివాస్‌ గౌడ్‌లను గురువారం న్యాయస్థానం ముందు హాజరుపరిచామని, దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు బాలానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఎల్లమ్మబండ కల్లు కాంపౌండ్‌లో ఇలా..

వినతి పత్రాలు అందించినా పట్టించుకోలేదు..

సాయిచరణ్‌ కాలనీకి చెందిన నర్సమ్మ కల్తీ కల్లుతాగి మృత్యువాత పడింది. ఈ ప్రాంతంలో కల్లు కాంపౌండ్‌ నిర్వహించవద్దని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకుండాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కల్తీ కల్లుకు పేదలు బలవుతున్నారు. కల్లు దుకాణాలను నగరానికి దూరంగా తరలించాలి.

– చందు, సాయిచరణ్‌ కాలనీ వాసి

కుటుంబాలు ఛిన్నాభిన్నం..

కల్తీ కల్లుతో పేద ప్రజల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. పలువురు అనారోగ్యాల బారిన పడటంతో వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. కూకట్‌పల్లి సర్కిల్‌లో గతంలో కల్తీ కల్లు తాగి కిడ్నీలు పాడై చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఎకై ్సజ్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు కల్తీ కల్లు దుకాణాలను కట్టడి చేయాలి.

– భద్రయ్య, కూకట్‌పల్లి

మూత్రపిండాలపై పెను ప్రభావం

క్లోరో హైడ్రేట్‌, డైజోఫాం, సిట్రిక్‌ యాసిడ్‌ వంటి రసాయనాలను చాలా అరుదుగా వాడతారు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాలతో సహా మిగతా అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కల్లీ కల్లు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. విక్రయించటం కూడా నేరమే.

– డాక్టర్‌ పి.వెంకటకృష్ణ, ఫెలోషిప్‌ ఇన్‌ డయాబెటాలజీ అండ్‌ జనరల్‌ ఫిజీషియన్‌

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు 1
1/3

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు 2
2/3

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు 3
3/3

మత్తెక్కిస్తున్న విష రసాయనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement