
ఆటో.. రూట్ ఎటో!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో ఆటోపర్మిట్ల దోపిడీ పర్వం మొదలైంది. వారం రోజులుగా ఆటోరిక్షాల షోరూంలలో డ్రైవర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు (ఫస్ట్ టూ ఫస్ట్ కమ్) పద్ధతిలో జరుగుతున్న ఈ నమోదు వల్ల డ్రైవర్లు షోరూమ్‌లకు పరుగులు తీస్తున్నారు. కేవలం డ్రైవర్ల వివరాలను నమోదు చేసేందుకే సుమారు రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో రిక్షాల ధరలను బహిరంగంగా ప్రకటించకుండా డ్రైవర్లను నమోదు చేసుకోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఆటో సంఘాల నాయకులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు.
ఈవీలకు ప్రోత్సాహం ఏమైనట్టో..? .
నగరంలోని ఆటోల స్థానంలో ఔటర్ వరకు పూర్తిగా ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. కేంద్రం రూపొందించిన ఈవీ పాలసీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ ఆటోలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 65 వేల ఆటో పర్మిట్లకు అనుమతులను ఇవ్వడంలో మతలబు ఏంటని ఆటో సంఘాలు, పర్యావరణ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఈవీల ముసుగులో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలను విక్రయించేందుకే ప్రభుత్వం ఈ పర్మిట్లను విడుదల చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎడాపెడా డ్రైవర్లను నమోదు చేసుకొన్న అనంతరం కొత్త ఆటోలకు కృత్రిమ కొరతను సృష్టించి భారీ ఎత్తున ధరలు పెంచేందుకు కొందరు డీలర్లు, ఫైనాన్షియర్లు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆటో సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
రిట్రోఫిట్‌మెంట్..ఎందుకో
అక్రమార్కులకు కొమ్ముకాసే విధంగా ఉన్న కొత్త పర్మిట్ల విధానం పూర్తి లోపభూయిష్టంగా ఉంది. ఒకవైపు ఈవీ పాలసీ కొనసాగుతుండగా కొత్తగా 20 వేల ఈవీలతో పాటు మరో 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు అనుమతులను ఇచ్చారు. ఇవి కాకుండా 25 వేల పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు రిట్రోఫిట్‌మెంట్ అనుమతులను ఇచ్చారు. అక్రమార్కులకు కొమ్ముకాస్తూ విడుదల చేసిన ఆటోరిక్షా పర్మిట్ల పందేరంలో డ్రైవర్లే మరోసారి సమిధలుగా మారనున్నారు.
నమోదైన చోట కొనేందుకేనా...
ఆటోడ్రైవర్లు తెలంగాణలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చని ఆర్టీఏ విధివిధానాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు షోరూమ్‌లలో రవాణాశాఖ లాగిన్ సౌకర్యం కల్పించారు. షోరూమ్‌ల వద్ద నుంచి వచ్చే డ్రైవర్ల వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారులు పర్మిట్లను విడుదల చేస్తారు. ఈ పర్మిట్లపై సదరు డ్రైవర్ కొత్త ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ తమ వద్ద ఆటోను కొనుగోలు చేసే డ్రైవర్ల వివరాలను మాత్రమే షోరూమ్‌లలో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ముందస్తుగా రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.
డీలర్ల అక్రమార్జన కోసమే 20 వేల ఎల్పీజీ, సీఎన్జీ పర్మిట్లు
ఔటర్ వరకు ఈవీలంటూనే ఎల్పీజీకి అనుమతులు
పాత ఆటోలకు ఈవీ రిట్రోఫిట్‌మెంట్‌లు