సకాలంలో రక్తం అందక బాలింత మృతి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో రక్తం అందక బాలింత మృతి

Jul 4 2025 6:57 AM | Updated on Jul 4 2025 6:57 AM

సకాలంలో రక్తం అందక బాలింత మృతి

సకాలంలో రక్తం అందక బాలింత మృతి

మలక్‌పేట: సకాలంలో రక్తం అందక బాలింత మృతి చెందిన సంఘటన మలక్‌పేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలు కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..అక్బర్‌బాగ్‌కు చెందిన సురేష్‌ భార్య నెమలిక(21) ప్రసవం నిమిత్తం మంగళవారం మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు తీవ్రరక్త స్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో, ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ లేనందున ఆమెను కోఠి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సకాలంలో వైద్యం అందనందునే నెమలిక మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు గురువారం ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. వందల కాన్పులు జరిగే ఏరియా ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

ఉప్పల్‌: రాష్ట్ర ఈగల్‌ టీం అంతర్రాష్ట్ర డ్రగ్‌ ముఠా గుట్టును రట్టు చేసింది. రాచకొండ డ్రగ్స్‌ నార్కొటిక్‌ బృందం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 2న ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం పార్కింగ్‌ గ్రౌండ్‌లో డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఈగల్‌ టీం మాటు వేసింది. ఆ ప్రాంతంలో తచ్చాడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి నుంచి 200 గ్రాముల ఒజి కుష్‌, 32 ఎక్స్‌టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా సికింద్రాబాద్‌ సింధీ కాలనీకి చెందిన కూరగాయల వ్యాపారి కామటం మోహిత్‌, మద్యప్రదేశ్‌కు చెందిన పాత వాహనాల వ్యాపారి స్వప్నిల్‌ వార్తెగా గుర్తించారు. తరచూ పబ్‌లకు వెళ్లే మోహిత్‌ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. తన అవసరాల కోసం అన్‌లైన్‌, కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకునే అతను వాటిని అవసరమైన వారికి విక్రయించేవాడు. ఈ నేపథ్యంలో స్వప్నిల్‌ వార్తే మధ్యప్రదేశ్‌ నుంచి బస్సులో ఓజికుష్‌ నగరానికి తీసుకు వచ్చి మోహిత్‌కు విక్రయించే వాడు. మంగళవారనం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద పార్కింగ్‌ గ్రౌండ్‌లో అతను మోహిత్‌కు డ్రగ్స్‌ అందిస్తుండగా రాచకొండ డ్రగ్స్‌ నార్కొటిక్‌ పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ ఆపరేషన్‌లో ప్రవీణ్‌ కుమార్‌, రామ్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ జీవన్‌ రెడ్డి, చెన్నరాయుడు పాల్గొన్నారు.

కారు ఇంజన్‌లో మంటలు

మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పక్కన భారత్‌ పెట్రోల్‌ పంపులో పెను ప్రమాదం తప్పింది. కారులో పెట్రోల్‌ పోయించుకుని వెళ్తుండగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సుదర్శన్‌ తన క్విడ్‌ కారులో షాద్‌నగర్‌ నుంచి వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలోని భారత్‌ పెట్రోల్‌ పంపులో పెట్రోల్‌ పోయించుకున్నాడు. తిరిగి వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెట్రోల్‌ పంపు సిబ్బంది ఫైర్‌ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement