Hyderabad Metro: 30% మోత! | - | Sakshi
Sakshi News home page

భారీగా చార్జీలు పెంచిన ఎల్‌ అండ్‌ టీ మెట్రో

May 6 2025 10:06 AM | Updated on May 6 2025 1:11 PM

మెట్రో చార్జీల మోత!

మెట్రో చార్జీల మోత!

ప్రయాణికులపై రోజుకు రూ.కోటి భారం

ఈ నెల 10 నుంచి కొత్త చార్జీలు అమలు

కనిష్టంగా రూ.12, గరిష్టంగా రూ.75

బెంగళూరులో చార్జీల పెంపు ప్రభావంపైన అధ్యయనం

అక్కడ 45 శాతం పెంచడంతో ప్రయాణికులు 7 శాతం తగ్గుముఖం

ఆ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని 30 శాతానికి పరిమితం

సాక్షి, హైద‌రాబాద్‌: మెట్రో చార్జీల పెంపు ఖరారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న చార్జీలను 30 శాతం వరకు పెంచనున్నారు. దీంతో ప్రయాణికులపైన రోజుకు సుమారు రూ.కోటి భారం పడనుంది. ప్రస్తుతం సగటున ఒక ప్రయాణికుడు రోజుకు రూ.40 చొప్పున చార్జీలు చెల్లిస్తున్నట్లు భావిస్తే పెరుగనున్న చార్జీల వల్ల మరో రూ.20 భారం పడనున్నట్లు అంచనా. అంటే కొత్త చార్జీల వల్ల సగటు ప్రయాణికుడు సుమారు రూ.60 వరకు చెల్లించవలసి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి రోజు సుమారు 4.8 లక్షల మంది ప్రయాణికుల నుంచి టిక్కెట్‌ల రూపంలో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలుకు రూ.1.92 కోట్ల ఆదాయం లభిస్తుండగా, చార్జీల పెంపుతో రూ.2.88 కోట్ల వరకు లభించనున్నట్లు అంచనా. ఈ మేరకు ప్రతి నెలా సుమారు రూ.87 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు ఆదాయం లభించవచ్చు.

కొంతమేర ఊరట..
ప్రస్తుతం నగరంలో మెట్రో రైళ్లు సుమారు రూ.6500 కోట్ల నష్టాలతో నడుస్తున్నాయి. మెట్రో రైళ్ల నిర్వహణ, విద్యుత్‌ వినియోగం, సిబ్బంది జీతభత్యాల చెల్లింపు, ఖర్చులను దృష్టిలో ఉంచుకొంటే టికెట్లపైన వచ్చే ఆదాయం తక్కువే అయినా చార్జీల పెంపు వల్ల కొంత మేరకు ఊరట లభించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి 26 కిలోమీటర్లకు పైగా గరిష్టంగా రూ.60ల వరకు చార్జీలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి కనిష్ట చార్జీలు రూ.12 నుంచి గరిష్టంగా రూ.75 వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. నగరంలోని మూడు కారిడార్‌లలో ప్రతిరోజు సుమారు 1200 ట్రిప్పులు నడుస్తున్నాయి. జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీ బస్‌స్టేషన్‌ కారిడార్‌లో రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ మిగతా రెండు కారిడార్‌లలోనే ప్రయాణికులు గరిష్టంగా రాకపోకలు సాగిస్తున్నారు. 

నాగోల్‌–రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ కారిడార్‌లలో ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. 2017 నవంబర్‌లో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చార్జీలను పెంచలేదు. ప్రతి సంవత్సరం వరుసగా నష్టాలు నమోదవుతూనే ఉన్నప్పటికీ చార్జీల పెంపుపైన ప్రభుత్వం నుంచి సానుకూలత లభించకపోవడం, 2023 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా చార్జీలను పెంచాలనే ప్రతిపాదనను హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎప్పటికప్పుడు వాయిదా వేయవలసి వచ్చింది. ‘రవాణా ఆధారిత ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేదు. రైళ్ల నిర్వహణ భారంగా మారింది. దీంతో చార్జీలను పెంచకతప్పడం లేదు.’ అని ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు.

30 శాతం ఎందుకంటే....

చార్జీల పెంపుపైన అన్ని విధాలుగా సమగ్ర అధ్యయనం చేసిన అనంతరమే 30 శాతం పెంచాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కనిష్ట దూరానికి ఇది 25 శాతమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు 4 నుంచి 6 కిలోమీటర్లకు ప్రస్తుతం రూ.15 ఉండగా ఇది రూ.20 వరకు పెరగనుంది. అలాగే ప్రస్తుతం 22 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల వరకు రూ.55 చార్జీ ఉంది. ఇది రూ.70 వరకు పెరుగనుంది. 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి ఇప్పుడు రూ.60 ఉంటే రూ.75 వరకు చార్జీలు పెరగనున్నాయి. 

బెంగళూరు మెట్రో చార్జీలపైన ప్రత్యేకంగా అధ్యయనం చేసిన అనంతరం నగరంలో 30 శాతం కంటే ఎక్కువ పెంచరాదని భావించినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆ నగరంలో మెట్రో చార్జీలను 45 శాతానికి పెంచారు. కొన్ని స్టేజీల మధ్య ఇది 50 శాతం వరకు ఉంది. దీంతో అక్కడ 4 కిలోమీటర్లకు రూ.20లు, గరిష్టంగా 26 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి రూ.90 వరకు చార్జీలు పెరిగాయి. ఈ అనూహ్యమైన పెంపుపైన ప్రయాణికుల నుంచి విముఖత వ్యక్తమైంది. దీంతో సుమారు 7 శాతం వరకు ప్రయాణికులు తగ్గారు. ఆ నగరంలో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో కొత్త చార్జీలను ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement