కేంద్రం పూచీకత్తు ఇస్తే రెండో దశ మెట్రో నిధులిస్తానంటున్న జైకా | - | Sakshi
Sakshi News home page

కేంద్రం పూచీకత్తు ఇస్తే రెండో దశ మెట్రో నిధులిస్తానంటున్న జైకా

Apr 11 2025 8:52 AM | Updated on Apr 11 2025 8:52 AM

కేంద్రం పూచీకత్తు ఇస్తే రెండో దశ మెట్రో నిధులిస్తానంటున

కేంద్రం పూచీకత్తు ఇస్తే రెండో దశ మెట్రో నిధులిస్తానంటున

సాక్షి, సిటీబ్యూరో:

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుంది రెండో దశ మెట్రో పరిస్థితి. నిధులిచ్చే సంస్థలు ఉన్నా అడుగు ముందుకు పడటంలేదు. ప్రతిపాదనలు, ప్రణాళికలు, సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను కూడా సిద్ధం చేసుకొని, చివరకు నిధులను సమకూర్చే సంస్థలను సైతం ఎంపిక చేసుకున్నప్పటికీ కేంద్రం ప్రాపకం లభించకపోవడంతో రెండో దశ మెట్రో ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొంది. నిధుల సేకరణలో భాగంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌) సంస్థ పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో రెండో దశ మెట్రోకు నిధులను అందజేసేందుకు జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ జైకా నుంచి సుముఖత లభించినట్లు తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులతో హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది. ప్రస్తుతం ప్రక్రియ కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. కేవలం కేంద్రం నుంచి సావరిన్‌ గ్యారంటీ లభించకపోవడం అనేదే ఇప్పుడు సాంకేతికంగా ఎదురవుతున్న సమస్య. రెండో దశపై రూ పొందించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి పంపించి 6 నెలలైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ అంతర్జా తీయ విమానాశ్రయానికి కనెక్టివిటీనిచ్చే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కానీ ఇప్పటికీ కేంద్రం నుంచి సావరిన్‌ గ్యారంటీ లభించలేదు. దీంతో రుణాలు ఇచ్చే సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.

ప్రైవేట్‌ సంస్థల నుంచి 52 శాతం నిధుల సేకరణ..

మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన 76.4 కిలోమీటర్ల కారిడార్‌ల నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం రూ.24,269 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తేంది. మరో 18 శాతం నిధులు అంటే రూ.4,230 కోట్లు కేంద్రం భరించాల్సి ఉంటుంది. మిగతా 52 శాతం నిధులు.. రూ.12,726 కోట్లు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించారు. మెట్రో స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలతో పాటు పలు పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్రం నుంచి లభించే ఆర్ధిక సహాయంతో పాటు రుణాల సేకరణ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జైకా సంస్థ నుంచి సానుకూలత లభించింది. కేంద్రం అనుమతి సహా అన్నీ అనుకూలిస్తే 2028 నాటికి ప్రతిపాదిత 5 కారిడార్‌లలో రైళ్లను నడపాలని హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

– గతేడాది డీపీఆర్‌లు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటి వరకు సావరిన్‌ గ్యారంటీ లభించకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంది. ‘మెట్రో రెండో దశకు నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం అనుమతి లభించడమే కీలకం’ అని అధికారులు చెబుతున్నారు. జైకాతో సంప్రదింపులు చాలావరకు తుదిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇతర మెట్రోపాలిటన్‌ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు కూడా పూర్తయ్యాయి. కానీ.. హైదరాబాద్‌లో మాత్రం ఏడు సంవత్సరాలు ఆలస్యంగా రెండోదశకు ప్రణాళికలను రూపొందించారు.ప్రస్తుతం మొదటి దశలోని 69 కిలోమీటర్ల కారిడార్‌లలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా, రెండో దశలో ప్రతిపాదించిన 5 కారిడార్‌లు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 8 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా.

ఆ సంస్థతో చర్చలు జరుపుతున్న హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌

కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతోనే జాప్యం

ప్రైవేట్‌ సంస్థల నుంచి 52 శాతం నిధుల సేకరణకు కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement