
పీఎస్‌లో లొంగిపోయిన నిందితుడు
మద్దూరు (హుస్నాబాద్): అల్లుడు వేట కొడవలితో అత్తను నరికి చంపాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ముర్మాముల గ్రామ శివారు బంజెరలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగిలి వజ్రమ్మ (55)కు భర్త యాదగిరి, కుమార్తె భవాని ఉన్నారు. భవానిని ఎనిమిదేళ్ల కిందట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన జక్కుల మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వజ్రమ్మ, భర్త యాదగిరి, కుమార్తె భవాని, అల్లుడు మహేశ్‌తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వజ్రమ్మ, కూతురు, అల్లుడి మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఈనెల 22న స్వగ్రామమైన బంజెరకు వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో వాటిని పరిష్కరించుకున్నారు. 26న భవానిని ధర్మారంలోని ఆమె అత్తగారింటికి పంపించారు. కుటుంబ కలహాలను మనసులో ఉంచుకున్న అల్లుడు మహేశ్ తన తమ్ముడైన హరీశ్‌ను వెంటబెట్టుకుని బైక్‌పై మధ్యాహ్నం బంజెరకు వెళ్లారు.
గ్రామంలో ఓ ఇంటి వద్ద కనిపించిన అత్త వజ్రమ్మపై మహేశ్, హరీశ్ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికి చంపారు. నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయి నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ సీఐ కొండ శ్రీను, ఎస్సై షేక్ మహబూబ్, నవీన్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.