
సాక్షి, నల్గొండ జిల్లా: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇవాళ ఉదయం (మంగళవారం) మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాగార్జునసాగర్ గేట్లను పైఎత్తి వరద నీటిని విడుదల చేశారు.
కాగా, సోమవారం శ్రీశైలం జలాశయానికి మొత్తం 2,31,612 క్యూసెక్కుల వరద వస్తుండగా రాత్రి 10 గంటలకు ఐదు గేట్లను ఒక్కోటీ 10 అడుగుల మేర పైకెత్తి మొత్తం 2,01,229 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.8 అడుగుల వద్ద 203.4290 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 584.41 అడుగులకు చేరుకుంది.
అలాగే గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 295.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా 28,785 క్యూసెక్కులను తెలంగాణ దిగువకు విడుదల చేస్తుండగా.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 5,394 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటోంది. ఎడమ ప్రధాన కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల అవసరాలకు మరో 6,634 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.