మెట్రో మూడో దశ రయ్‌ రయ్‌ | Sakshi
Sakshi News home page

మెట్రో మూడో దశ రయ్‌ రయ్‌

Published Sun, Sep 3 2023 2:40 AM

- - Sakshi

హైదరాబాద్‌: మెట్రో రైల్‌ మూడో దశ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగరానికి నలువైపులా, ఔటర్‌ రింగ్‌రోడ్డు మార్గంలో నిర్మించనున్న మెట్రో మూడో దశపైన ప్రాథమిక, సవివర నివేదికల కోసం శనివారం కన్సల్టెన్సీలను నియమించారు. సాంకేతికంగా అత్యధిక మార్కులు పొందిన ఆర్వీ అసోసియేట్స్‌కు 2 ప్యాకేజీలను అప్పగించగా, ఆ తర్వాత స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థకు మరో రెండు ప్యాకేజీలను అప్పగించినట్లు హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

● గత నెలలో కన్సల్టెన్సీల నియామకానికి టెండర్లను ఆహ్వానించగా 5 సంస్థలు బిడ్‌లను సమర్పించాయి. వీటిలో ఆర్వీ అసోసియేట్స్‌, సిస్ట్రా, యూఎంటీసీ, రైట్స్‌ అనే 4 సంస్థలు సాంకేతిక అర్హతను సాధించాయి. అనంతరం ఈ నాలుగింటి ఆర్థిక బిడ్‌లను ఆగస్టు 30న మెట్రో రైల్‌ భవన్‌లో తెరిచారు. ఆర్వీ అసోసియేట్స్‌ సాంకేతికంగానే కాకుండా తక్కువ ఆర్థిక బిడ్‌లను సమర్పించి ముందంజలో ఉన్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన రెండు ప్యాకేజీలను అతితక్కువ ఆర్థిక బిడ్‌తో పాటు సాంకేతిక అర్హత పొందిన సిస్ట్రా సంస్థకు ఇచ్చినట్లు చెప్పారు.

● ఈ రెండు కన్సల్టెన్సీ సంస్థలు వచ్చే రెండు నెలల్లో ట్రాఫిక్‌ సర్వేలు, రవాణా రద్దీ అంచనాలు, ట్రాఫిక్‌ అంచనాలు, పలు రకాల రవాణా వ్యవస్థల విశ్లేషణ వంటి వివిధ అధ్యయనాలు పూర్తి చేసి ప్రిలిమినరీ ప్రాజెక్ట్‌ నివేదిక (పీపీఆర్‌)లను సమర్పించాలి. ఆ తర్వాత మూడు నెలల్లో మెట్రో రైలు అలైన్‌న్‌మెంట్‌, వయాడక్ట్‌/భూ ఉపరితల మార్గం/భూగర్భ మార్గం వంటి ఆప్షన్‌లు, స్టేషన్లు, డిపోలు, రైల్వే విద్యుత్‌ ఏర్పాట్లు, సిగ్నలింగ్‌, రైల్వే సమాచార వ్యవస్థ, రైలు బోగీలు, పర్యావరణం,సామాజిక ప్రభావం, ఆదాయ వ్యయ అంచనా, చార్జీల పట్టిక , ప్రాజెక్టు అమలు విధానం వంటి విషయాలపై సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్‌)లను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ కన్సల్టెన్సీ సంస్థలను వివిధ కారిడార్‌లలో సత్వరమే సర్వే పనులను ప్రారంభించాలని నిర్దేశించినట్లుగా ఎండీ తెలిపారు.

నగరానికి నలువైపులా..

నగరానికి నలువైపులా నిర్మించతలపెట్టిన మెట్రో మూడో దశలో మొత్తం 12 కారిడార్‌లలో 278 కిలోమీటర్లలో మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎంఆర్‌టీఎస్‌) అందుబాటులోకి రానుంది. భారీ నిధులతో చేపట్టనున్న మెట్రో మూడోదశ ప్రాజెక్టు నిర్మాణంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ తదితర ప్రభుత్వ సంస్థలు, విభాగాల భాగస్వామ్యం కూడా ఉంది. ఈ ప్రాజెక్టులో 8 కారిడార్‌లలో మెట్రో విస్తరణ చేపట్టనుండగా, ఔటర్‌ మార్గంలోని మరో 4 కారిడార్‌లలో కొత్తగా నిర్మించనున్నారు. మూడో దశ మెట్రోను మొత్తం 4 ప్యాకేజీలుగా నిర్మించేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ప్రణాళికలను సిద్ధం చేసింది.

నాలుగు ప్యాకేజీలుగా మెట్రో నిర్మాణం..

1) మొదటి ప్యాకేజీలో బీహెచ్‌ఈఎల్‌–పటాన్‌చెరు–ఓఆర్‌ఆర్‌–ఇస్నాపూర్‌ (13కి.మీ), ఎల్‌బీనగర్‌– హయత్‌నగర్‌– పెద్దఅంబర్‌పేట్‌ (13 కి.మీ), ఓఆర్‌ఆర్‌ పటాన్‌చెరు ఇంటర్‌చేంజ్‌–కోకాపేట్‌–నార్సింగ్‌ ఇంటర్‌చేంజ్‌ (22 కి.మీ)

2) రెండో ప్యాకేజీలో శంషాబాద్‌ జంక్షన్‌ మెట్రో స్టేషన్‌– కొత్తూరు–షాద్‌నగర్‌ (28కి.మీ), శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ స్టేషన్‌– తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌– మహేశ్వరం ఎక్స్‌రోడ్‌–ఫార్మాసిటీ (26 కి.మీ.) శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌చేంజ్‌– తుక్కుగూడ–బొంగుళూరు–పెద్ద అంబర్‌పేట్‌ ఇంటర్‌చేంజ్‌ (40 కి.మీ)

3) మూడో ప్యాకేజీలో ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌–ఘట్కేసర్‌ ఓఆర్‌ఆర్‌–బీబీనగర్‌ (25 కి.మీ.), తార్నాక ఎక్స్‌రోడ్‌– ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌ (8 కి.మీ), ఓఆర్‌ఆర్‌ పెద్ద అంబర్‌పేట్‌ ఇంటర్‌చేంజ్‌– ఘట్కేసర్‌– శామీర్‌పేట్‌– మేడ్చల్‌ ఇంటర్‌చేంజ్‌ (45 కి.మీ)

4) నాలుగో ప్యాకేజీలో జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్‌ ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ లేదా మెట్రో రైల్‌, ప్యారడైజ్‌– కండ్లకోయ డబుల్‌ ఎలివేటెడ్‌ / మెట్రో (12 కి.మీ), ఓఆర్‌ఆర్‌ మేడ్చల్‌ ఇంటర్‌చేంజ్‌–దుండిగల్‌–పటాన్‌చెరు ఇంటర్‌చేంజ్‌ (29 కి.మీ)

Advertisement
Advertisement