వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్న వీధి విక్రయదారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపుల పురోగతి, కొత్త అర్హుల గుర్తింపు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించడం వంటి పలు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) వైవీ.గణే శ్, జిల్లా లీడ్ బ్యాంకు ప్రతినిధి తదితరులున్నారు.
మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైద్యసేవలపై నిర్లక్ష్యం వద్దు..
రోగులకు అందించాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారులను కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాశాఖాధికారి, సూపరింటెండెంట్లతో సోమవారం సమావేశం నిర్వహించి జిల్లాలో అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఇందులో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.


