కాశిబుగ్గ: వరంగల్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పేరుకు నోడల్ సెంటర్ ఉన్నప్పటికీ సిబ్బంది లేక అరకొర సేవలతో కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన నోడల్ సెంటర్ నుంచి ఈఎస్‌ఐ పరిధిలో 16 డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేస్తున్నారు. రీజియన్‌లోని ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిస్పెన్సరీలకు పంపిణీ చేయాలి. సాధారణంగా నోడల్ సెంటర్‌కు ఒక ఫార్మాసిస్ట్, ఒక క్లర్క్, ఐదుగురు నాల్గవ తరగతి సిబ్బంది, ప్రత్యేకంగా వ్యాన్ సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. దీంతో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సేవలు అందని ద్రాక్షలా మారాయి.
రూ.4.8 కోట్లతో మందుల కొనుగోలు..
రెండేళ్ల క్రితం నోడల్ సెంటర్ మంజూరు కావడంతో రూ. 4.8 కోట్లతో టెండర్ ద్వారా ఎంపికై న కాంట్రాక్టర్ మందులను కొనుగోలు చేశారు. కానీ, ఆ బిల్లులు ఇంత వరకు రాకపోకవడం, సదరు కాంట్రాక్టర్ తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ ఒత్తిడి తీసుకోస్తున్నారు. వివిధ రకాల మెడిసిన్‌కు ఫండ్ రాక తిరిగి ఈ ఏడాది మందులు కొనుగోలు చేయడం అధికారులకు సవాల్‌గా మారింది.
ఆరునెలల నుంచి అందని భోజనం
ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని ఇన్‌పేషెంట్లకు ఆరునెలల నుంచి భోజనం అందడం లేదని తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి డైట్‌కు సంబంధించిన బిల్లులు రాకపోవడం వల్ల భోజనం పెట్టలేదని సమాచారం. బిల్లులు పేరుతో సదరు కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోవడంతో బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసి భోజనం తెచ్చుకోవాల్సి వస్తోంది. అసలే పేద కార్మికులు చికిత్స కోసం వచ్చి అడ్మిట్ అయితే భోజనం కోసం కడుపు మాడ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోతే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం శోఛనీయం.
అరకొర సేవలు.. అలమటిస్తున్న రోగులు
పేరుకే నోడల్ సెంటర్
పూర్తి స్థాయిలో డిస్పెన్సరీలకు
అందని మందులు
ఇన్‌పేషెంట్లకు చేరని భోజనం


