హన్మకొండ అర్బన్: జిల్లాలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం–2007ను పకడ్బందీగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం కోరింది. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను సోమవారం వారు కలెక్టరేట్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గతేడాది ప్రారంభించిన వృద్ధుల డే–కేర్ సెంటర్‌ను సందర్శించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, తదూరి లక్ష్మీనారాయణ, మార్క రవీందర్‌గౌడ్, ఎస్.రమేశ్, శీలం వెంకటేశ్వర్లు, గుంటి సీతారాములు, కొండబత్తిని రాజేందర్, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్ : చంద్రగ్రహణం ఉన్నందున వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణి కోట అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణలు పూజలు నిర్వహించి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం అనుమతించనున్నట్లు తెలిపారు.
కేయూ క్యాంపస్: హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ వర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్‌కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు సోమవారం వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో బి.నిఖిల్‌గౌడ్, కె.శ్రీశాంత్‌గౌడ్, ఎం.సంజయ్, పినవదీప్, వి.వంశీకృష్ణ, విన్‌పాల్, జి.అభిషేక్, జి.చంద్రశేఖర్ ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్.రమేశ్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు.
హన్మకొండ అర్బన్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కాగా, దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.


