హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ సబ్‌స్టేషన్‌లో నిర్మాణ సమయంలోనే లైట్నింగ్ అరెస్టర్‌లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైట్నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది.
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైట్నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్‌లో 95, వరంగల్ సర్కిల్‌లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్‌లో 52, మహబూబాబాద్ సర్కిల్‌లో 38 అరెస్టర్లు ఏర్పాటు చేశారు.
ఎలా పనిచేస్తుందంటే..
లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్‌ఫార్మర్‌లు, సబ్‌స్టేషన్లు, స్విచ్‌గేర్, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది.
ఉరుములు, మెరుపులనుంచి
రక్షణకు నిరోధకాల బిగింపు
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైట్నింగ్ అరెస్టర్ల ఏర్పాటు
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో సుదూరంగా ఉండే విద్యుత్‌లైన్లలో లైట్నింగ్ అరెస్టర్‌లు చేశాం. వినియోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరుపు సమయంలో విద్యుత్ పరికరాలను తాకొద్దు.
– వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ


