అండర్–19 క్రికెట్ చాంపియన్ కరీంనగర్
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ కేంద్రంగా వారం రోజులు నిర్వహించిన అండర్–19 క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో శనివారం ఫైనల్ జరిగింది. కరీంనగర్ , మెదక్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో 107 పరుగుల తేడాతో మెదక్ పై కరీంనగర్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ నిర్ణీత 50 ఓవర్లకు గాను 39.5 ఓవర్లు ఎదుర్కొని 260 పరుగులు సాధించింది. కరీంనగర్ జట్టులో బ్యాట్స్‌మెన్ తక్షిల్ 104 బంతులు ఎదుర్కొని 20 బౌండరీలు, 2 సిక్సర్లతో చెలరేగి 145 పరుగులు సాధించగా, మెదక్ బౌలర్ హిషాంత్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన మెదక్ జట్టు 29.5 ఓవర్లు ఎదుర్కొని 153 పరుగులు సాధించి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో కరీంనగర్ జట్టు 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెదక్ బ్యాట్స్‌మెన్ విఘ్నేష్ 36 పరుగులతో రాణించగా, కరీంనగర్ ఆల్‌రౌండర్ తక్షిల్, అహ్మద్ చెరో 3వికెట్లను తీసి మెదక్‌ను కట్టడి చేశారు.
టోర్నీలో తక్షిల్ దూకుడు..
తక్షిల్ టోర్నమెంట్ మొత్తం మీద 15 సిక్సర్లు, 62 బౌండరీలు సాధించడమే కాకుండా ప్రతీ మ్యాచ్‌లో మంచి స్కోరుతో రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లూ తీస్తూ కరీంనగర్ జట్టుకు కప్‌ను అందించడంలో కీలకంగా వ్యవహరించాడు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి సీనియర్ క్రీడాకారుడు శరత్‌చంద్ర ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ ప్రతినిధి మనోహర్‌రావు, మెదక్ కార్యదర్శి రాజేంద్రరెడ్డి, మార్నేని ఉదయభానురావు, మట్టెడ కుమార్, బండారి ప్రభాకర్ పాల్గొన్నారు.
రన్నరప్ మెదక్ ..


