బస్సుల కండీషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్
హన్మకొండ: మేడారం జాతరలో బస్సుల వైఫల్యం లేకుండా కండీషన్‌పై మెయింటెనెన్స్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ సూచించారు. బుధవారం వరంగల్ ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ రీజియన్ల ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో బస్సులు ఫెయిల్ కాకుండా మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బ్రేక్‌డౌన్ కాకుండా బస్సులను సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ మేనేజర్ కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్ రవి చంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ సెంటర్: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం ఒక్కో కళాశాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ బోధనకు ఉపకరించే సామగ్రి పంపణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా ఐఐటీ, ఎప్‌సెట్, నీట్ బోధన సులభతరం అవుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ కోసం జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన వివరించారు.


