రేపు బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభను ఈ నెల 9న వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (16 జిల్లాల పరిధి) కా ర్యదర్శి నీలారపు రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని 2006లో స్థాపించినట్లు చెప్పారు. సంఘం స్థాపించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్‌లో శుక్రవారం రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటా రని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వి ద్యుత్ ఉద్యోగులు తరలొచ్చి ఈ మహాసభను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పెరుమాండ్ల సత్యనారాయణ, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు నాగిళ్ల సదానందం, నాయకులు చంద్రమౌళి, సత్యనారాయణ, సర్వేశ్వర్, ప్రసాద్, కృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ కార్యదర్శి రాజేందర్


