మరమ్మతు కేంద్రాల మూసివేత
నేటినుంచి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల
హన్మకొండ: ప్రైవేట్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాల యజమానుల సంక్షేమ సంఘం మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. నేటి(గురువారం)నుంచి మరమ్మతు కేంద్రాలను మూసి వేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్‌ఫార్మర్స్ రిపేరింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి కాలిన ట్రాన్స్‌ఫార్మర్లు స్వీకరించడం, మరమ్మతు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను ఇవ్వడం పూర్తిగా నిలిచిపోనుంది. నాలుగు నెలల క్రితం మెరుపు సమ్మెకు దిగగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమించారు. నాలుగు నెలలవుతున్నా యాజమాన్యం ముందుంచిన 20 డిమాండ్లలో ఏ ఒక్కటి పరిష్కరించ లేదు. దీనిపై పలుమార్లు చర్చలు జరిపినా సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని మొత్తం 16 జిల్లాల్లోని 176 ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలు మూసివేయనున్నారు. పెరిగిన మెటీరియల్ రేట్ ప్రకారం ధర పెంచాలని, కూలీలకు కనీస వేతనాలు కల్పించాలని తాము కోరినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఎన్పీడీసీఎల్ ట్రాన్స్‌ఫార్మర్స్ రిపేరింగ్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్జుల నర్సింహారెడ్డి తెలిపారు.
మెరుపు సమ్మెకు దిగిన మరమ్మతు
కేంద్రాల యజమానులు


